
ఇప్పటికే రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి కలకలం సృష్టిస్తున్నవేళ తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో విస్కీ ఐస్ క్రీమ్‌లు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. మత్తుపై ఉక్కుపాదం మోపుతామని సర్కారు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నా మార్పు రావడం లేదు. ఏకంగా సామాజిక మాధ్యమాలనే వేదికగా చేసుకుని విస్కీ ఐస్ క్రీమ్‌లు విక్రయాలు చేస్తుండగా ఎక్సైజ్ టాస్క్‌పోర్స్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. పార్లర్ నుంచి 11.5కిలోల ఐస్‌క్రీంను స్వాధీనం చేసుకున్నారు.
చిన్నపిల్లలే లక్ష్యంగా విస్కీ ఐస్‌క్రీమ్‌లు విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారుల విచారణలో తేలింది. కిలో ఐస్ క్రీమ్‌లో 60 ఎంఎల్ విస్కీ కలుపుతున్నట్లు గుర్తించామని, నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపుతామని అధికారులు తెలిపారు. పూర్తి ఆధారాలు సమర్పించి నిందితులకు కఠినంగా శిక్షపడేలా చూస్తామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. 21 ఏళ్లు దాటిన వారికే మద్యం విక్రయాలు చేయాలని చట్టాలు చెబుతున్నా వాటన్నింటినీ అతిక్రమించి ఏకంగా చిన్నారులే లక్ష్యంగా విస్కీ ఐస్‌క్రీమ్‌లు అమ్మడం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తోంది.
‘జూబ్లీహిల్స్‌లో రోడ్ నంబర్ 5లో తనిఖీలు నిర్వహించాం. ఓ చాక్లెట్ ఐస్క్రీమ్ వంద శాతం వీస్కీ కలిపినట్లు గుర్తించాం. ఆల్కహాల్తో ఐస్క్రీమ్ తయారు చేయడం, పైగా విక్రయించడం చట్టరీత్యా తప్పు. అందుకు మేం వాటిని సీజ్ చేశాం. చెఫ్ను అసిస్టెంట్ను అరెస్టు చేశాం. విస్కీ ఐస్ క్రీమ్‌లు తయారు చేస్తున్నారని తెలుస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఐస్ క్రీమ్‌లు తయారు చేసే చివరి దశలో వీస్కీ కలుపుతున్నారు. ఇదీ పిల్లల మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది‘ అని స్టేట్ టాస్క్‌ఫోర్స్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ రావు తెలిపారు.
ఐస్‌క్రీమ్‌లో వీస్కీ కలిపి విక్రయాలు జరుపుతున్న ముఠాపై దాడులు చేసి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరిలించామని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్‌మెంట్ జాయింట్ డైరెక్టర్ ఖురేషి తెలిపారు. జూబ్లీహిల్స్లోని 1 కిలో ఐస్క్రీమ్లో విస్కీ కలుపుతూ చిన్నపిల్లల భవిష్యత్తుకు కష్టం కలిగించే అటువంటి ఐస్ క్రీమ్ పార్లర్పై తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు.
చాలామంది విస్కీఐస్ క్రీంకు బానిసలుగా మారడంతో నిర్వాహకులు ఎక్కువ ధరకు విక్రయించడం ప్రారంభించారు. ఎక్కువ ధరకు విక్రయిస్తున్న కూడా తినేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఐస్‌క్రీం తినేందుకు యువకులు, పిల్లలు ఎగబడుతున్నారు. వ్యాపారం పెంచుకునేందుకు నిందితులు ఏకంగా ఫేస్‌బుక్‌లో ప్రచారం నిర్వహించినట్లు చేశారు. మరోవైపు ఖమ్మం జిల్లాలో అనేక మార్లు ఏఓపీ నుంచి వస్తున్నటువంటి గంజాయిని సైతం పట్టుకున్నామని, ఇదే తీరులో గురువారం ఖమ్మంలో 59 కేజీల గంజాయిని పట్టుకున్నారని ఖురేషి వెల్లడించారు.
More Stories
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం
తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు