సింగపూర్ ప్రధానితో మోదీ భేటీ

సింగపూర్ ప్రధానితో మోదీ భేటీ
విదేశీ పర్యటనలో భాగంగా సింగపూర్ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించేందుకు ఆ దేశ ప్రధాని లారెన్స్ వాంగ్​తో సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించిన తర్వాత నాలుగు కీలక అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. 
 
రెండు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్​లో పోస్ట్ చేశారు.  లారెన్స్ వాంగ్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ సింగపూర్​కు వచ్చారు. గురువారం ఉదయం అక్కడి పార్లమెంట్ల్​ హౌస్​కు చేరిన మోదీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రతినిధుల స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 
 
అందులో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించే విధంగా చర్చలు జరిపినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎక్స్​ వేదికగా పేర్కొంది. కనెక్టివిటీ, డిజిటలైజేషన్, హెల్త్​కేర్ అండ్ మెడిసిన్, స్కిల్క్ డెవలప్​మెంట్ సుస్థిరాభివృద్ధి వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం నాలుగు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు.

వాంగ్‌తో చర్చలకు ముందు సింగపూర్ పార్లమెంట్ హౌస్ వద్ద మోదీకి రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. అక్కడి విజిటర్స్ బుక్‌పై సంతకం కూడా చేశారు. సింగపూర్‌ కేవలం భాగస్వామ్య దేశమే కాకుండా అభివృద్ధి చెందుతున్న ప్రతి దేశానికి స్ఫూర్తిదాయకమని మోదీ పేర్కొన్నారు. తాము కూడా భారత్​లో అనేక సింగపూర్‌లను సృష్టించాలనుకుంటున్నామని తెలిపారు. ఆ దిశలో కలిసి పని చేస్తున్నందుకు సంతోషిస్తున్నట్లు చెప్పారు.

వాంగ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి, మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నెలరోజుల తర్వాత ఇరువురు నేతల మధ్య సమావేశం జరిగింది.  ఈ సమావేశం అనంతరం ప్రధాని మోదీ సింగపూర్ రాష్ట్రపతి ధర్మన్​ షణ్ముగరత్నంతో భేటీ కానున్నారు. సింగపూర్ వ్యాపారవేత్తలతో కూడా సమావేశం కానున్నారు. అనంతరం మోదీ, లారెన్స్ వాంగ్ కలిసి సెమీకండక్టర్ల తయారీ కేంద్రాన్ని కూడా సందర్శించనున్నారు.

రెండ్రోజుల పర్యటన నిమిత్తం మోదీ బ్రూనై నుంచి సింగపూర్‌కు చేరుకున్నారు. రెండు దేశాల స్నేహబంధాన్ని బలోపేతం చేసుకోవడం, పెట్టుబడుల్ని ఆకర్షించడం తన పర్యటన ఉద్దేశమని చెప్పారు. అపారంగా ఉన్న యువశక్తి, సంస్కరణల కారణంగా భారత్‌ ఇప్పుడు పెట్టుబడులకు ఆదర్శ గమ్యంగా మారిందని పేర్కొన్నారు.