
‘క్యాస్టింగ్ కౌచ్’ ఆరోపణలు మలయాళ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించగా, కాంగ్రెస్ పార్టీలో కూడా అలాంటి పరిస్థితే ఉందని, సినీ పరిశ్రమకు అదేమీ తీసిపోదంటూ ఆ పార్టీ సీనియర్ నేత సిమీ రోజ్‌బెల్ జాన్ విమర్శలు చేశారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పార్టీలో చాలామంది మహిళలు తాము ఎదుర్కొన్న బాధాకరమైన అనుభవాలను తనతో పంచుకున్నారని తెలిపారు.
పార్టీకి సంబంధించిన మహిళలపై కొందరు పురుష నేతలు అభ్యంతరకరంగా ప్రవర్తించారని, పదవులు ఆశచూపి కొంతమంది సీనియర్ నేతలు మహిళలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆమె తీవ్రమైన ఆరోపణలు చేశారు. వీటికి సంబంధించిన ఆధారాలు తగిన సమయంలో బయటపెడతానని ఆమె వెల్లడించారు. తనపై ఫిర్యాదు ఇచ్చిన వారు కూడా దీనిని గమనించాలని ఆమె కోరారు.
ఈ సందర్భంగా ఆమె ఎంపీ జేబీ మేథర్ పేరును, మరికొందరి పేర్లను ప్రస్తావిస్తూ పార్టీలో వారికి అనవసర గౌరవాలు దక్కాయని ఆరోపించారు. మహిళా కాంగ్రెస్‌లో ఎనిమిదేళ్ల క్రితమే చేరినప్పటికీ ఆమెను యూత్ కాంగ్రెస్‌కు అఖిల భారత కార్యదర్శిగా నియమిస్తే తామంతా మౌనంగా ఉండిపోయామని ఆమె గుర్తు చేశారు.
రోస్‌భెల్ శనివారం ఓ చానెల్‌తో మాట్లాడుతూ పార్టీలో మహిళలను లైంగికంగా వేధిస్తున్నారంటూ ప్రతిపక్ష నేత వి.డి.సతీశన్ సహా పలువురిపై ఆరోపణలు చేశారు. నాయకుల మెప్పు పొందేవారికే ముఖ్యమైన పదవులు దక్కుతున్నాయని స్పష్టం చేశారు. అయితే, రోస్‌బెల్ ఆరోపణలను సతీశన్ ఖండించారు. ఆమెకు ఏఐసీసీ పదవులు దక్కాయని గుర్తు చేశారు.
మీడియా ముందు మహిళా నేతలను కించపరిచినందుకు రోస్‌బెల్‌ను ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరిస్తున్నట్టు పార్టీ నాయకత్వం ప్రకటించింది. కాంగ్రెస్‌లో సీనియర్ నాయకురాలు అయిన ఆమె ప్రకటన తీవ్రసంచలనానికి దారితీసింది. ఇతర చోట్ల రాజకీయాల పరిస్థితిపై తనకు అంతగా తెలియదని, అయితే కేరళ కాంగ్రెస్ యూనిట్‌లో ఇది తీవ్రస్థాయిలోనే ఉందని ఆరోపించారు.
అధిష్ఠానం ఆదేశాలను అనుసరించడానికి నిరాకరించిన మహిళలపై కొందరు నేతలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. అదే సమయంలో కొంతమంది మహిళల పట్ల అలవిమాలిన ప్రేమను కనబరుస్తున్నారని విమర్శించారు.
కాగా, ఆమె తప్పుడు ఆరోపణలకు దిగారని, సంచలనంతో పేరు తెచ్చుకోవాలనో , మరో ఆలోచనతోనో ఈ విధంగా వ్యవహరిస్తున్నారని పార్టీ నేతలు ఎదురుదాడికి దిగారు. ఆమెపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఇప్పటి పరిణామంపై కెపిసిసి అధ్యక్షులు కె సుధాకరన్ స్పందిస్తూ ఆమెపై ఫిర్యాదు అందిందని, తగు విధంగా నిజానిజాలు నిర్థారించడం జరుగుతుందని తెలిపారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు