హసీనా అప్పగింతకై వత్తిడి పెంచుతున్న బిఎన్‌పి

* బంగ్లాలో హిందూ టీచర్లతో బలవంతంగా రాజీనామాలు

బంగ్లాదేశ్‌ పదవీచ్యుత ప్రధాని షేక్‌ హసీనాను తిరిగి వెనక్కి పంపించడం ద్వారా భారత్‌, బంగ్లా దేశ్‌ మధ్య సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలకాలని ఆ దేశంలో ప్రతిపక్షమైన మితవాద బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బిఎన్‌పి) వత్తిడి పెంచుతున్నది. ఆదివారం నాడు పార్టీ 46వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జనరల్‌ మీర్జా ఫక్రుల్‌ అలంగీర్‌ హసీనాను బంగ్లాదేశ్‌కు తిరిగి అప్పగించకపోతే భారత్‌తో సంబంధాలు మరింత క్షీణిస్తాయని హెచ్చరించారు. 

హసీనా, ఆమె పాలనలో చోటు చేసుకున్న నేరాలు, అవినీతికి బంగ్లాదేశ్‌ చట్టాల ప్రకారం ఆమె విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. దీనిని ప్రారంభించాలంటే అమెను బంగ్లాదేశ్‌కు తిరిగి అప్పగించేందుకు భారత్‌ చర్యలు తీసుకోవాలని ఆయన తేల్చి చెప్పారు. హసీనాకు ఆశ్రయం కల్పించడం ద్వారా భారత్‌ బంగ్లా దేశ్‌ ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవడంలో విఫలమైందని అలంగీర్‌ విమర్శించారు.

కాగా, బంగ్లాదేశ్‌లో మైనార్టీల భద్రత గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఇది తమ అంతర్గత విషయం ఆయన దాటవేశారు. హిందువులపై దాడులకు సంబంధించిన వార్తలు కచ్చితమైనవి కావని, వీటిలో చాలా ఘటనలు మత పరంగా జరిగినవి కావని, కేవలం రాజకీయ ప్రేరేపితమైనవి మాత్రమేనని అని ఆయన సెలవిచ్చారు. 

అయితే, భారత్‌తో బలమైన సంబంధాలను తమ పార్టీ కోరుకుంటోందని, బంగ్లాదేశ్‌ గడ్డపై భారత్‌కు ముప్పు కలిగించే ఎలాంటి కార్యకలాపాలను బిఎన్‌పి ఎప్పటికీ అనుమతించడదని ఆయన చెప్పారు. బిఎన్‌పి అధికారంలోకి వస్తే అదానీతో హసీనా ప్రభుత్వం కదుర్చుకున్న విద్యుత ఒప్పందాన్ని పునస్సమీక్షిస్తామని వెల్లడించారు. 

ఈ ఒప్పందం బంగ్లా దేశ్‌ ప్రజలపై తీవ్ర విద్యుత్‌ భారాలను మోపుతోందని, బంగ్లా ప్రజల్లో కూడా దీనిపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు. అదే సమయంలో స్వేచ్ఛామార్కెట్‌ ఆర్థిక సంస్కరణలను తాము విస్తృతంగా అమలు చేస్తామని చెప్పారు.  ఇలా ఉండగా, అల్లర్లతో అట్టుడికిన బంగ్లాదేశ్‌లో ఇప్పుడు అల్లరి మూకలు హిందూ టీచర్లను లక్ష్యంగా చేసుకున్నాయి. వారితో బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నాయి. ఇప్పటికే 50 మంది ఉపాధ్యాయులు రాజీనామాలు చేశారు. నిజానికి ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉండొచ్చని చెప్తున్నారు. 

ఆగస్టు 29న కొందరు విద్యార్థులు, ఇతర నిరసనకారులతో కలిసి బరిషల్‌లోని బాకర్‌గంజ్‌ ప్రభుత్వ కాలేజీలోకి దూసుకెళ్లి ప్రిన్సిపాల్‌ శుక్లారాణి హైదర్‌తో వాగ్వివాదానికి దిగి రాజీనామాకు డిమాండ్‌ చేశారు. చేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించడంతో ఖాళీ పేపర్‌పై ‘నేను రాజీనామా చేస్తున్నాను’ అని రాసిచ్చి ఆమె వెళ్లిపోయారు. 

ఆగస్టు 18న దాదాపు 50 మంది విద్యార్థులు అజీంపూర్‌ ప్రభుత్వ బాలికల స్కూల్‌, కాలేజీలోకి చొరబడి ప్రిన్సిపాల్‌ గీతాంజలి బారువా, అసిస్టెంట్‌ హెడ్‌ టీచర్‌ గౌతమ్‌ చంద్రపాల్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ షహనాజా అక్తర్‌లతో రాజీనామా చేయించారు. ఇవేకాదు, ఇలాంటి బలవంతపు రాజీనామాలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి.

మరోవంక, హసీనా ప్రభుత్వ హయాంలో భారత్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలను సమీక్షించే అవకాశముందని తాత్కాలిక ప్రభుత్వ విదేశీ సలహాదారు తౌహిద్‌ హుస్సేన్‌ తెలిపారు. దేశ ప్రయోజనాలకు మేలు చేకూర్చేవిగా లేవని భావించిన వాటిని సమీక్షించవచ్చని ఆయన తెలిపారు.

షేక్‌ హసీనాను తిరిగి బంగ్లాదేశ్‌కు రప్పిస్తారా? అని అడగ్గా, అవసరమైతే ఆమెను అప్పగించాలని ప్రభుత్వం భారత్‌ను కోరుతుందని చెప్పారు. అయితే, ఆమెను అప్పగిస్తారా లేదా అనేది భారత్‌పై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. భారత్‌లో ఏ హోదాలో ఆమె ఆశ్రయం పొందుతున్నారని అడగ్గా, దాని గురించి తనకు తెలియదని చెప్పారు. ఈ ప్రశ్న మీరు భారత్‌నే అడగండని సూచించారు.