
హైదరాబాద్ తొలినుంచి మతసామరస్యానికి, ప్రశాంతతకు మారు పేరని, దాన్ని మరింత ఇనుమడింపజేసేలా గణేశ్ ఉత్సవాలను నిర్వహించాలని ఉత్సవ కమిటీలు, మండప నిర్వాహకులు, అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. గణేశ్ ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ నిర్వహణపై ఆయన సచివాలయంలో సమీక్షించారు. రెండు పండుగలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ప్రభుత్వం తరఫున పోలీసు, జీహెచ్‌ఎంసీ, ఆర్‌అండ్‌బీ, నీటి పారుదల, విద్యుత్తు శాఖలతో పాటు ఇతర ముఖ్య శాఖల అధికారులు, మండప నిర్వాహకులు సమన్వయం చేసుకోవాలని చెప్పారు. మండప నిర్వాహకులు ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. మండపాలకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలన్న భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించారు.
ఉచిత విద్యుత్తుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనుమతులు లేకుండా విద్యుత్తును వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి ప్రభుత్వానికి,నిర్వాహకులకు మధ్య సమన్వయం ఉండాలని రేవంత్ రెడ్డి తెలిపారు. మండపాల ఏర్పాటు, తొమ్మిది రోజుల ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనానికి సంబంధించి మండప నిర్వాహకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
గత ఏడాది ఔటర్ రింగు రోడ్డు పరిధిలో 1.50 లక్షల విగ్రహాలు ఏర్పాటు చేశారన్న అంచనాలున్న నేపథ్యంలో మొత్తం విగ్రహాలను హుస్సేన్ సాగర్‌కే కాకుండా ఇతర చెరువుల్లోనూ నిమజ్జనం చేసే అవకాశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. దీంతో సాగర్ వద్ద రద్దీ తగ్గడంతో పాటు ఆయా చెరువుల వద్ద నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం ముందుగానే చేసే వీలుంటుందని చెప్పారు.
ఈ విషయంలో ఉత్సవ సమితి సభ్యులు, మండప నిర్వాహకులు ముందగానే సమాచారం ఇవ్వాలని సూచించారు. 17న నిమజ్జనం ఉండగా.. అదే రోజున తెలంగాణ విలీన దినం ఉందని గుర్తు చేశారు. ముందుగా మండప నిర్వాహకులు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లోనో అనుమతులు తీసుకోవాలని, అలా తీసుకోవడం వలన ఆయా ప్రాంతాల్లో భద్రత, ట్రాఫిక్ ఇతర ఇబ్బందులు తలెత్తకుండా చూసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.
కాగా, నిమజ్జనం రోజైన సెప్టెంబరు 17వ తేదీన అనంత చతుర్దశి వచ్చిందని, ఆ రోజు ప్రాముఖ్యతను తెలుపుతూ దేవాదాయ శాఖ తరఫున ప్రచారం చేయాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు జి.రాఘవరెడ్డి విజ్ఞప్తి చేయగా.. అవసరమైన ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావును సీఎం ఆదేశించారు.
మండపాల్లో డీజేలు వాడేందుకు అనుమతివ్వాలని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కోరగా, సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. మొత్తంగా 25 వేల మందితో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు డీజీపీ జితేందర్, హైదరాబాద్ సిటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఎటువంటి లోటుపాట్లకు తావివ్వద్దని, జోన్ల వారీగా ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగించాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు.
సమావేశంలో మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వర్‌రావు, రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, షబ్బీర్‌అలీ, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, మేయర్ విజయలక్ష్మి, సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు.
సీఎం నిర్వహించిన సమీక్షలో జీహెచ్‌ఎంసీ పరిధి ఎమ్మెల్యేలు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్, అరెకపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్ వంటివారిని సమావేశానికి పిలవకపోవడం గమనార్హం. ఉత్సవాల నిర్వహణకు సంబంధించి నగరం పరిధిలోని నలుగురు లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకోవాలని పోలీసులను సీఎం ఆదేశించారు. సీఎంకు, సిటీ ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ పెరిగిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
More Stories
భారత్‌ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!