ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ మంజూరు

ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ మంజూరు
ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ బెయిల్‌ ఇచ్చింది. బెయిల్‌ కోసం రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించాలని సూచించింది. సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. దీంతో దాదాపు 165 రోజుల తర్వాత కవిత జైలు నుంచి బయటకు రానున్నారు.
 
తిహాడ్‌ జైలులో ఉన్న కవిత బెయిల్‌పై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానంలో సుదీర్ఘ విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నిర్వహించింది. బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.  లిక్కర్‌ కేసులో దర్యాప్తు పూర్తయ్యిందని, ఛార్జ్‌ షీట్‌ కూడా దాఖలైందని ఈ దశలో కవితను జ్యుడీషియల్‌ కస్టడీలో ఉంచడం సరికాదని అభిప్రాయడింది.
సెక్షన్‌ 45 ప్రకారం ఒక మహిళ బెయిల్‌ పొందేందుకు అర్హత ఉందని ధర్మాసనం తెలిపింది. గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టిపారేసింది. సెక్షన్‌ 45 అనేది దుర్బల మహిళలకు మాత్రమే వర్తిస్తుందన్నట్లు హైకోర్టు జడ్జి వ్యవహరించారని పేర్కొంది.  సెక్షన్‌ 45పై కోర్టులు సున్నితంగా వ్యవహరించాలని చెప్పింది. ఒక మహిళ విద్యాధికురాలు అయినంత మాత్రాన ఆమెకు బెయిల్‌ నిరాకరించడం సరికాదని తెలిపింది. ఈ మేరకు బెయిల్‌ను మంజూరు చేసింది. 
కవిత తరుఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ ఈ కేసులో సహ నిందితుడు మనీష్ సిసోడియాకు బెయిలు ఇచ్చారని, ఈడీ, సీబీఐ కేసులో ఇప్పటికే చార్జిషీట్ దాఖలు అయ్యిందని పేర్కొన్నారు.  దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందని,  57 మంది నిందితులు ఈ కేసులో ఉన్నారని చెబుతూ  కవిత దుర్భల మహిళ కాదు అన్నది నిజం కాదని ముకుల్ రోహత్గీ స్పష్టం చేశారు. కేసులో 493 మంది సాక్షులను విచారించారని పేర్కొన్నారు. సిసోడియాకు ఇచ్చిన బెయిల్ అంశాలే కవితకూ వర్తిస్తాయని ముకుల్ రోహత్గీ తెలిపారు. 
 
కవిత ఫోన్లలో ఉన్న డేటాను ఉద్దేశపూర్వకంగా ఫార్మాట్ చేశారని ఈడీ తరుఫు లాయర్ తెలిపారు. కవిత అసలు దర్యాప్తునకు సహకరించలేదని చెప్పారు. ఫోన్లలో మెసేజ్‌లను డిలీట్ చేయడం సహజమే కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఫోన్‌లో డేటా ఎక్కువైనప్పుడు అరేజ్ చేసుకుంటాం కానీ ఫార్మాట్ చేయబోమని ఈడీ తరుఫు న్యాయవాది ఎస్వీ రాజు తెలిపారు.సాక్ష్యులను బెదిరించారని చెబుతున్నారని, కానీ ఎక్కడా ఏ కేసూ దానికి సంబంధించి నమోదు కాలేదని ముకుల్ రోహత్గీ తెలిపారు. కవిత నిరక్షరాస్యులు కాదు. ఏది మంచి, ఏది చెడు కాదో తెలియదా? అప్రూవర్ అరుణ్ పిళ్లై ఎందుకు స్టేట్మెంట్ ఉపసంహరించుకున్నారు ? అని జస్టిస్ గవాయి ప్రశ్నించారు.  కవితకు సెక్షన్ 45 ఎందుకు వర్తించదని ఈడీ, సీబీఐ తరుఫు లాయర్లను జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. ‘అరుణ్ పిళ్లైను కవిత ప్రభావితం చేశారని అంటున్నారు. కానీ ఆ సమయంలో పిళ్లై జైల్లో ఉన్నాడు. ఎలా ప్రభావితం చేస్తారు?’ అని ఈడీ తరుఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది.

‘అవును. ఆ సమయంలో పిళ్లై జైల్లోనే ఉన్నారు. కానీ జైల్లో ఉన్నవారిని కూడా ప్రభావితం చేయవచ్చు. జైల్లో కుటుంబ సభ్యులు, న్యాయవాదులు వారిని కలుస్తూనే ఉంటారు. వారి ద్వారా ప్రభావితం చేయవచ్చు’ అని ఈడీ తరుఫు న్యాయవాది ఎస్వీ రాజు తెలిపారు. సుప్రీంకోర్టులో కవిత బెయిల్ కేసు విచారణ సందర్భంగా కోర్టుకు బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి శుభాష్ రెడ్డి, ఎంపీ వద్దీరాజు రవిచంద్ర తదితర నేతలు హాజరయ్యారు.