ఖర్గే ట్రస్టుకు కర్ణాటక కాంగ్రెస్‌ సర్కార్‌ భూసంతర్పణ

ఖర్గే ట్రస్టుకు కర్ణాటక కాంగ్రెస్‌ సర్కార్‌ భూసంతర్పణ
ముడా, వాల్మీకి కార్పొరేషన్‌ స్కామ్‌లు ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్‌ సర్కార్‌ను కుదిపేస్తుండగా  మరో సంచలన వ్యవహారం తాజాగా బయటకు వచ్చింది. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుటుంబానికి చెందిన ‘సిద్ధార్థ విహార ట్రస్టు’కు రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా భూమి కేటాయించిందనే ఆరోపణలు వస్తున్నాయి. 
 
రాష్ట్ర రాజధాని బెంగళూరుకు సమీపంలోని హైటెక్‌ డిఫెన్స్‌ ఏరోస్పేస్‌ పార్క్‌లో కర్ణాటక ఇండస్ట్రియల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ బోర్డు (కేఐఏడీబీ)కి చెందిన 5 ఎకరాలను కేటాయించారన్న వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనంగా మారింది. ఈ వ్యవహారానికి సంబంధించి బీజేపీ రాజ్యసభ ఎంపీ లహర్‌ సింగ్‌ సిరోయా పలు ఆరోపణలు చేశారు. 
 
కేఐఏడీబీకి చెందిన మొత్తం 45.94 ఎకరాల్లో ఖర్గే ట్రస్టుకు 5 ఎకరాలు కేటాయించారని ఆయన పేర్కొన్నారు. కేఐఏడీబీ భూమిని పొందేందుకు ఖర్గే కుటుంబం ఏరోస్పేస్‌ ఆంత్రప్రెన్యూర్లుగా ఎప్పుడు మారిందని ప్రశ్నిచారు. ఈ వ్యవహారంలో భారీస్థాయిలో అక్రమాలు చోటుచేసుకొన్నాయని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. 
 
‘సిద్ధార్థ విహార ట్రస్టు’లో ట్రస్టీలుగా ఖర్గేతో పాటు ఆయన భార్య రాధాభాయ్‌, కుమారులు ప్రియాంక్‌ ఖర్గే(రాష్ట్ర మంత్రి), రాహుల్‌ ఖర్గే, అల్లుడు రాధాకృష్ణ(గుల్బర్గా ఎంపీ) తదితరులు ఉన్నారని ఎంపీ లహర్‌ సింగ్‌ తన ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు. ప్రజల సౌకర్యాల కోసం ఉద్దేశించిన భూమిని ట్రస్టు ఎస్సీ కోటా కింద పొందిందని ఆయన ఆరోపించారు. 
 
ఇది అధికారి దుర్వినియోగం, బంధుప్రీతి కాదా? అని ప్రశ్నించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఈ కేటాయింపునకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్‌ ఏ విధంగా ఆమోదం తెలిపారని ప్రశ్నించారు. ఈ అక్రమ భూ కేటాయింపు వ్యవహారం ఒక ఆర్టీఐ కార్యకర్త ద్వారా గవర్నర్‌ కార్యాలయానికి కూడా చేరిందని ఆయన పేర్కొన్నారు. ఈ అక్రమ భూ కేటాయింపుపై విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు.