జమ్ముకశ్మీర్‌ లో 70 స్థానాల వరకు బిజెపి పోటీ

జమ్ముకశ్మీర్‌ లో 70 స్థానాల వరకు బిజెపి పోటీ

* లడఖ్‌లో ఐదు కొత్త జిల్లాల ఏర్పాటు

సుమారు పదేండ్ల తర్వాత జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత జరుగనున్న ఎన్నికలు కావడంతో బీజేపీ సహా ప్రధాన పార్టీలన్నీ అధికారాన్ని దక్కించుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా 60 నుంచి 70 స్థానాల్లో పోటీచేయాలని భావిస్తున్నది.
అదీ ఇతర పార్టీలతో ఎలాంటి పొత్తు లేకుండా బరిలోకి దిగనుంది. ఈ మేరకు ఆదివారం జరిగిన ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తున్నది.  తాము పోటీలో లేని చోట బలమైన స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.   
44 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను తొలుత విడుదల చేయగా, అభ్యర్థుల ఎంపికలో అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అనూహ్యంగా గంటల వ్యవధిలోనే ఆ జాబితాను ఉపసంహరించుకున్నారు. ఆ వెంటనే సవరించిన జాబితాను తొలి విడత ఎన్నికల కోసం 15 మంది అభ్యర్థులతో తాజాగా ప్రకటించారు.
పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా  అధ్యక్షతన ఆదివారం జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, జమ్మూ కాశ్మీర్ బీజేపీ నేతలు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ కు రాష్త్ర హోదాను పునరుద్ధరిస్తామని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇవ్వనున్నారని చెబుతున్నారు.  అదేవిధంగా పలువురు ముస్లిం అభ్యర్థులను కూడా పోటీకి దింపనున్నారు. 317 అధికరణ రద్దుతో తమకు కొంత సానుకూల వాతావరణం ఏర్పడిందని భావిస్తున్న బీజేపీ కేంద్రపాలిత ప్రాంతంలో పట్టుకోసం ప్రయత్నిస్తున్నది.
మొత్తం 90 స్థానాలున్న జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల చేసింది. మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. కాంగ్రెస్- నేషనల్ కాన్ఫరెన్స్  ఎన్నికల పొత్తు పెట్టుకోబోతున్నట్లు ప్రకటించాయి. మొదటి దశ పోలింగ్ సెప్టెంబర్ 18న, మిగతా రెండు రౌండ్లు సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న జరగనున్నాయి. ఆగస్టు 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా, తెలుగు వ్యక్తులైన రామ్‌ మాధవ్‌, కిషన్‌ రెడ్డిలను ఎన్నికల ఇన్‌చార్జిలుగా బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. చివరిసారిగా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 25, పీడీపీకి 28 సీట్లు వచ్చాయి. 
 
దీంతో పీడీపీ చీఫ్‌ మొహమ్మద్‌ ముఫ్తీ సయీద్‌ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2016, జనవరిలో సయీద్‌ మరణంతో ఆయన కుమార్తే మెహబూబా ముఫ్తీ సీఎం పీఠాన్ని అధిరోహించారు. అయితే ఈ సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడలేక పోయింది.  2018 జూన్‌లో ముఫ్తీ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకున్నది. ప్రభుత్వం కుప్పకూలడంతో రాష్ట్రంలో గవర్నర్‌ పాలన విధించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం 317 ఆర్టికల్‌ను రద్దు చేసి.. కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది.
ఇలా ఉండగా, కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సోమవారం వెల్లడించారు. ప్రధాని మోదీ విజన్‌ ప్రకారం లడఖ్‌ అభివృద్ధి, శ్రేయస్సును కాంక్షిస్తూ ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఐదు కొత్త జిల్లాల పేర్లను జన్స్కర్‌, ద్రాస్‌, షామ్‌, నుబ్రా, చాంగ్‌థాంగ్‌గా పేర్కొన్నారు. 

జిల్లాలు ప్రజా సేవలను మెరుగుపరుస్తాయని ఈ సందర్భంగా అమిత్‌ షా చెప్పారు. అదేవిధంగా మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న స్థానికులకు ప్రభుత్వ చొరవను మరింత చేరువ చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. లడఖ్‌ అడ్మినిష్టేషన్‌ అధికారిక వెబ్‌సైట్‌ ప్రకారం.. కేంద్ర పాలిత ప్రాంతంలో ఇప్పటికే రెండు జిల్లాలు లెహ్‌, కార్గిల్‌ను ఏర్పాటు చేశారు.