
హిమాలయాల్లోని హిమానీనదాలు (గ్లాసియర్స్) తరచూ పొంగిపొర్లడంతో తరుచూ వరదలు సంభవిస్తుండటంతో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డిఎంఎ) అప్రమత్తమైంది. 189 హై రిస్క్ హిమానీనదాలను గుర్తించి, పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. వాటి కారణంగా వచ్చే ప్రమాదాలను తగ్గించడానికి ప్రతిపాదిత చర్యలను ఖరారు చేసినట్లు ఎన్‌డిఎంఎ తెలిపింది.
వాటిలో భాగంగా ఈ సరస్సులను పరిశోధించడానికి నిపుణుల బృందాలను ఏర్పాటు చేయడం, ”సరస్సు- తగ్గించే చర్యలు” (సరస్సులు పొంగిపొర్లకుండా తటస్థంగా ఉండేలా చేయడం ), దిగువ ప్రాంతాలలో నష్టాన్ని తగ్గించడానికి యత్నించడం వంటి చర్యలను చేపట్టనుంది. గతేడాది అక్టోబర్‌లో, సిక్కింలోని దక్షిణ లోనాక్ సరస్సు పొంగి పొర్లడంతో ఈశాన్య రాష్ట్రంలోని అనేక ప్రాంతాలను ముంచెత్తింది. ఈ విపత్తులో సుమారు 40 మంది మరణించగా, చుంగ్తాంగ్ డ్యామ్ ధ్వంసమైన సంగతి తెలిసిందే.
నేషనల్ గ్లేసియల్ లేక్ అవుట్బర్స్ ఫ్లడ్స్ రిస్క్ మిటిగేషన్ ప్రోగ్రామ్ (ఎన్జిఆర్ఎంపి) పథకాన్ని జులై 25న కేంద్రం ఆమోదించింది. భారత్‌లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో దాదాపు 7,500 హిమానీనద సరస్సులు ఉన్నాయి. వాటిలో కొన్ని రిమోట్ సెన్సింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఆ ప్రాంతాలను ప్రత్యక్షంగా సందర్శించడం ద్వారా మాత్రమే హిమానీనదాల ప్రభావాన్ని అంచనావేయడం సాధ్యమవుతుంది. అయితే ఆ ప్రాంతాలకు చేరుకోవడం కష్టం. జులై నుండి సెప్టెంబర్ వరకు మాత్రమే ఆప్రాంతాలకు వెళ్లేందుకు అనువుగా ఉంటాయి.
ఈ వారం అరుణాల్ ప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ, తవాంగ్ మరియు దిబాంగ్ వ్యాలీ జిల్లాల్లోని ఆరు హైరిస్క్ హిమానీనదాలను అధ్యయనం చేయడానికి బృందాలను పంపింది. సెంట్రల్ వాటర్ కమిషన్ (సిడబ్ల్యుసి) గతేడాది అక్టోబర్ నివేదికలో 902 హిమానీనదాలను మరియు నీటి వనరులను శాటిలైట్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది.
హిమానీనదాలకు సమీపంలో, దిగువప్రాంతాల్లో అటోమేటెడ్ వెదర్ అండ్ వాటర్ లెవల్ మానిటరింగ్ స్టేషన్స్ (ఎడబ్ల్యుడబ్ల్యుఎస్), అలాగే ముందస్తు హెచ్చరిక వ్యవస్థ (ఇడబ్ల్యుఎస్)లను ఏర్పాటు చేయడం ద్వారా సాంకేతికంగా ప్రమాదాలను అంచనావేయడం ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. సిక్కింలో ఆరు సార్లు, లడఖ్‌లో ఆరు సార్లు, హిమాచల్ ప్రదేశ్‌లో ఒకసారి, జమ్ము కాశ్మీర్లో రెండు సార్లు కలిపి మొత్తంగా 15 సార్లు బృందాలు పర్యవేక్షణ చేపట్టాయి.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్