దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సామరస్యపూర్వకంగా పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి త్వరలో కొందరు సభ్యులతో ఒక కమిటీని వేయనున్నట్టు సుప్రీం కోర్టు గురువారం తెలిపింది. రైతులకు సంబంధించిన తాత్కాలిక సమస్యలను ఈ కమిటీకి తెలియజేయాలని పంజాబ్, హర్యానా రాష్ర్టాలను ఆదేశించిన జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కేసును సెప్టెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది.
ఆగస్టు 12న సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు శంభూ సరిహద్దు వద్ద ఆందోళన చేస్తున్న రైతులతో తాము చర్చలు జరిపామని, అడ్డగించిన హైవేను పాక్షికంగా తెరవడానికి రైతులు అంగీకరించారని పంజాబ్ ప్రభుత్వం ధర్మాసనానికి తెలిపింది. రైతులతో చర్చలు కొనసాగించవలసిందిగా పంజాబ్, హర్యానా ప్రభుత్వాలకు సూచించిన ధర్మాసనం హైవే పైనుంచి ట్రాక్టర్లు, ట్రాలీలను తొలగించడానికి రైతులకు నచ్చచెప్పాలని కోరింది.
ఫిబ్రవరి 13 నుంచి రైతులు మకాంవేసి ఆందోళన చేస్తున్న అంబాలా సమీపంలోని శంభూ సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను వారం రోజుల్లోగా తొలగించాలని ఆదేశిస్తూ పంజాబ్, హర్యనా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ హర్యానా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది.

More Stories
ఉధంపూర్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం
పెల్లెట్ గన్ వాడకంపై దర్యాప్తు కమిటీ మార్పుకు సుప్రీం నిరాకరణ
భారత్-అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు ‘యుద్ధ అభ్యాస్’