11 రోజుల సమ్మెను విరమించిన ఎయిమ్స్‌ వైద్యులు

11 రోజుల సమ్మెను విరమించిన ఎయిమ్స్‌ వైద్యులు

* మాజీ ప్రిన్సిపాల్‌తో సహా నలుగురికి పాలిగ్రాఫ్‌ టెస్ట్‌

సుప్రీంకోర్టు విజ్ఞప్తితో 11 రోజుల సమ్మెను ఎయిమ్స్‌ వైద్యులు విరమించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా, ప్రజాసేవా స్ఫూర్తితో డాక్టర్ల సమ్మెను విరమించినట్లు ఎయిమ్స్‌ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఆర్డీఏ) పేర్కొంది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటనను విడుదల చేసింది.  కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై దారుణ హత్యాచారానికి నిరసనగా ఎయిమ్స్‌ వైద్యులు సమ్మెబాట పట్టారు. అయితే ఈ కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

ఈ నేపథ్యంలో డాక్టర్లు సమ్మె విరమించి విధుల్లో చేరాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ గురువారం అభ్యర్థించారు.  ఈ నేపథ్యంలో 11 రోజుల సమ్మెను విరమిస్తున్నట్లు ఎయిమ్స్‌ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఆర్‌డీఏ) తెలిపింది. కోర్టు చర్యను అభినందిస్తున్నామని, కోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉండాలని నిర్ణయించినట్లు పేర్కొంది. పేషెంట్ కేర్ తమ మొదటి ప్రాధాన్యత అని వెల్లడించింది.

కాగా, ఆర్‌జీ కర్‌ మెడికల్ కాలేజీ సంఘటన, దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ సిబ్బంది భద్రతకు సంబంధించిన విస్తృత సమస్యను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టుకు ఎయిమ్స్‌ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్‌ ధన్యవాదాలు తెలిపింది. సుప్రీంకోర్టు అప్పీల్ మేరకు దేశ ప్రయోజనాల దృష్ట్యా, ప్రజాసేవా స్ఫూర్తితో 11 రోజుల సమ్మెను విరమించుకోవాలని నిర్ణయించినట్లు ప్రకటనలో పేర్కొంది.

డాక్టర్లపై ఎఫ్‌ఐఆర్‌లు రద్దు చేయాలంటే ముందు విధుల్లో చేరాలని అంతకు ముందు సుప్రీంకోర్టు సూచించింది. వైద్యులు విధుల్లో చేరాకే అన్ని విషయాలను పరిశీలిస్తామని తెలిపింది. వైద్యులకు భద్రతపై రాష్ట్రాలు రెండు వారాల్లో చర్యలు చేపట్టాలని ఆదేశించింది. హత్యాచార ఘటనను రాజకీయం చేయొద్దని, చట్టం తన పని చేసుకుపోతుందని తెలిపింది. అనంతరం తదుపరి విచారణను సెప్టెంబర్ 5కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో వైద్యులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.

కాగా,  ఈ కేసుకు సంబంధించి ఆర్ జీ కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌తోపాటు మరో నలుగురు వైద్యులకు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐకి కోల్‌కతా హైకోర్టు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆగస్ట్ 9వ తేదీ తెల్లవారుజామున ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటన చోటు చేసుకుంది. 

ఆ రోజు డాక్టర్ సందీప్ ఘోష్‌తోపాటు మరో నలుగురు వైద్యులు విధుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారికి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు కోల్‌కతా హైకోర్టును సీబీఐ అనుమతి కోరింది. సీబీఐ అభ్యర్థన పట్ల కోల్‌కతా హైకోర్టు సానుకూలంగా స్పందించింది. మాజీ ప్రిన్సిపాల్‌ సందీప్ ఘోష్‌ను ఇప్పటికే పలుసార్లు ప్రశ్నించింది. జూనియర్‌ వైద్యురాలి హత్యాచార ఘటనలో ఆయన పాత్రపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, వైద్యురాలి మృతదేహాన్ని చూసేందుకు ఆమె తల్లిదండ్రులను దాదాపు మూడు గంటలపాటు సందీప్ ఘోష్‌ వేచి ఉంచిన ఆరోపణలపై కూడా సీబీఐ ఆయనను ప్రశ్నించింది. అలాగే డాక్టర్‌ మృతదేహాన్ని గుర్తించిన సెమినార్ హాల్ ప్రక్కనే ఉన్న గదుల పునరుద్ధరణ పనుల గురించి కూడా ఘోష్‌ను అడిగింది. ఆయన చెప్పిన సమాధానాలను లై డిటెక్టర్‌ టెస్ట్‌ ద్వారా పోల్చి చూడాలని సీబీఐ భావిస్తున్నది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి అరెస్టైన వాలంటీర్ సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు సీబీఐ ఇప్పటికే హైకోర్టు అనుమతిని పొందింది.