జమ్ముకశ్మీర్‌లోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఖరారు అయిందని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు. తన నివాసంలో రాహుల్ గాంధీ, హస్తం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో గురువారం సమావేశమైన అనంతరం పొత్తు విషయాన్ని వెల్లడించారు. విపక్ష ఇండియా కూటమి మంచి ట్రాక్‌లో ఉందని తెలిపారు. దేశం
లోని విభజన శక్తులను ఓడించేందుకు నేషనల్ కాంగ్రెస్- కాంగ్రెస్ ఉమ్మడిగా పోరాడతాయని తెలిపారు. సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అంతకుముందు శ్రీనగర్లో కాంగ్రెస్ కార్యకర్తలను మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కలిశారు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడి అభిప్రాయాలను సేకరించారు.
ఆ సమయంలో జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడమే కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ప్రాధాన్యమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఇది ఎన్నికలకు ముందే జరుగుతుందని ఊహించామని, కానీ ఎలక్షన్ కోడ్ విడుదలైందని చెప్పారు. జమ్ముకశ్మీర్ ప్రజలతో తనకు చాలా అనుబంధముందని తెలిపారు.
జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించడం ఒక ముందడుగు అని రాహుల్ పేర్కొన్నారు. వీలైనంత త్వరలో జమ్ముకశ్మీర్ ప్రజల హక్కుల పునరుద్ధరణ జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. సాయం అందించడంలో ప్రజలకు కాంగ్రెస్ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో గడ్డు కాలముందన్న రాహుల్, దానిని తాము అర్థంచేసుకుని, హింసను తొలగించాలని భావిస్తున్నట్లు తెలిపారు. సోదరభావంతో ప్రేమ దుకాణాన్ని తెరవాలని కోరుకుంటున్నట్లు రాహుల్‌గాంధీ మరోసారి చెప్పారు.
“స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం ఇదే తొలిసారి. ఇలా గతంలో ఎన్నడూ జరగలేదు. కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలుగా మారాయి. కానీ, రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతంగా మారడం ఇదే మొదటిసారి. జమ్ముకశ్మీర్, లద్దాఖ్ ప్రజలు తమ హక్కులను తిరిగి పొందడం మా ప్రాధాన్యమని కాంగ్రెస్ జాతీయ ఎన్నికల ప్రణాళికలో మేం స్పష్టంగా చెప్పాం.” అని తెలిపారు.
వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో పొత్తులకు తాము సానుకూలంగా ఉన్నట్లు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. “ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి సమావేశం ఇదే. ఎన్నికలు, పొత్తుల కోసం స్థానిక కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశాం” అని చెప్పారు.
“రాహుల్ గాంధీ నాయకత్వంలో జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు యత్నిస్తాం. ఆ దిశగా ప్రయతాలు చేస్తామని మేం హామీ ఇస్తున్నాం. ఇతర పార్టీలతో కలిసి ఎన్నికల బరిలో దిగేందుకు రాహుల్ కూడా ఆసక్తిగా ఉన్నారు” అని ఖర్గే వెల్లడించారు.
More Stories
జార్జ్ సోరోస్ నిధులు సమకూర్చే సంస్థతో సోనియా!
సరిహద్దు భద్రతకు డ్రోన్ వ్యతిరేక విభాగం
ప్రతిపక్షాలు ప్రజాతీర్పును స్వాగతించాలి