
గాజాలో ఇజ్రాయెల్‌హమాస్ మధ్య సాగుతున్న యుద్ధాన్ని ఆపాలని, హమాస్ బందీలో ఉన్న వారిని విడుదల చేయాలని ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ దేశాల నేతలు పిలుపునిచ్చారు. మానవతా సాయం ఎలాంటి ఆటంకాలు లేకుండా బాధితులకు అందేలా చొరవ తీసుకోవాలని కూడా కోరారు. ఈమేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
తాజాగా అమెరికా, కతార్, ఈజిప్టు దేశాలు 10 నెలలుగా సాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి ముగింపు పలికేలా మధ్యవర్తిత్వం నిర్వహించడానికి తీసుకుంటున్న చొరవకు ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ దేశాల నేతలు మద్దతు పలికారు. మధ్యవర్తులు కొన్ని నెలల పాటు దీనికోసం ప్రయత్నిస్తున్నారు.
మూడు దశల ప్రణాళికను అంగీకరింప చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రణాళిక ప్రకారం హమాస్ అక్టోబర్ 7న తాను బందీ చేసిన వారిలో మిగిలిన వారిని తక్షణం విడిచిపెట్టాల్సి ఉంటుంది. అలాగే తాను బందీ చేసిన పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ విడిచిపెట్టాలి.
గాజా నుంచి ఇజ్రాయెల్ వైదొలగాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రకటనపై ఫ్రెంచి అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ , జర్మనీ ఛాన్సెలర్ ఒలాఫ్‌స్కాల్జ్, బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్ సంతకాలు చేశారు.
ఇలా ఉండగా, గాజాలో ఇజ్రాయెల్ దాడులకు గత 48 గంటల్లో 142 మంది మృతి చెందారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో 150 మంది గాయపడ్డారు. దీంతో గాజాలో పాలస్తీనియన్ల మృతుల సంఖ్య మొత్తం 39.897కు పెరిగిందని, మొత్తం 92,000 గాయపడ్డారని సోమవారం ప్రకటించారు.
ఇజ్రాయెల్‌పై ఆకస్మికంగా గత అక్టోబర్ 7న హమాస్ దాడికి పాల్పడినప్పుడు పాలస్తీనియా మిలిటెంట్లు 1200 మందిని మట్టుబెట్టారు. మృతుల్లో చాలా మంది పౌరులు ఉన్నారు. దాదాపు 250 మందిని బందీ చేశారు. వీరిలో చాలామందిని గత నవంబర్‌లో యుద్ధం ఆగినసమయంలో విడుదల చేయగా, ఇంకా 110 మంది గాజాలో బందీలుగా ఉన్నారు. వీరిలో మూడో వంతు మంది చనిపోయి ఉంటారని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది.
More Stories
పాక్ కు అత్యాధునిక మిస్సైల్స్‌ను సరఫరాకు అమెరికా వ్యతిరేకత
గాజాకు సాయం అందించేందుకు అన్ని సరిహద్దులు తెరవాలి
కాబూల్‌పై పాకిస్థాన్ బాంబుల వర్షం… టీటీపీ చీఫ్ హతం?