హిందువులకు క్షమాపణలు చెప్పిన బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం

హిందువులకు క్షమాపణలు చెప్పిన బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం
షేక్‌ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వంపై తిరుగుబాటు రాజీనామా అనంతరం బంగ్లాదేశ్‌లో అస్థిరత, అశాంతి నెలకొన్నది. చాలా ప్రాంతాల్లో హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. దేవాలయాలపై సైతం అల్లరిమూకలు దాడులకు తెగబడుతూ దోచుకుంటున్నాయి. 
 
ఈ క్రమంలో దాడులకు వ్యతిరేకంగా ఆదివారం వేలాది మంది నిరసనకారులు ఢాకా వీధుల్లోకి వచ్చి మైనారిటీలకు భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. కాగా.. భద్రత కల్పించడంలో విఫలమైనందుకు హిందూ సమాజానకి తాత్కాలిక ప్రభుత్వంలోని హోం వ్యవహారాల సలహాదారు బ్రిగేడియర్‌ జనరల్‌ (రిటైర్డ్‌) ఎం సఖావత్‌ హుస్సేన్‌ క్షమాపణలు చెప్పారు.
 
హిందూ మైనారిటీని రక్షించడం ముస్లిం మెజారిటీ కర్తవ్యమని, ఈ బాధ్యతలో వైఫల్యాన్ని అంగీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే, హిందూ సమాజానికి ఇక ముందు తగు రక్షణ కల్పించగలమని ఆయన హామీ ఇచ్చారు.  మైనారిటీలను రక్షించడం మెజారిటీ సమాజానికి అత్యంత కర్తవ్యమని తాము ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. 
 
అలా చేయకుండా మసీదులో నమాజ్ చేయడంలో బిజీగా ఉంటే వారు ఎందుకు విఫలమయ్యారో సమాధానం చెప్పాల్సి ఉంటుందని హుస్సేన్ స్పష్టం చేశారు. భద్రత కల్పించేందుకు, మైనారిటీలను రక్షించడం తమ మతంలో భాగం అని ఆయన తెలిపారు. దేశమంతా అశాంతిలో ఉందని, పోలీసులు సైతం మంచి స్థితిలో లేరని చెప్పారు.
 
సఖావత్ మాట్లాడుతూ, “మా మైనారిటీ సోదరులను రక్షించడం మెజారిటీ కమ్యూనిటీ అత్యంత ముఖ్యమైన కర్తవ్యమని మేము ఆదేశించాము. అలా చేయకుంటే భద్రత కల్పించడంలో ఎందుకు విఫలమయ్యారో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మన మైనారిటీలను కాపాడుకోవడం కూడా మన మతంలో భాగమే. నేను నా మైనారిటీ సోదరులకు క్షమాపణలు కోరుతున్నాను” అని చెప్పారు.
 
కాబట్టి వారిని రక్షించాలని తాను సమాజాన్ని కోరుతున్నానని అయన తెలిపారు. మైనారిటీలు సొంత సోదరులవంటివారేనని, తామంతా కలిసే పెరిగామని ఆయ స్పష్టం చేశారు న తేల్చి చెప్పారు.  ఇలా ఉండగా, మైనారిటీ మతల ప్రతినిధులతో తాత్కాలిక ప్రభుత్వ అధినేత ముహమ్మద్ యూనుస్ మంగళవారం సమావేశం జరుపనున్నారు. వారి సమస్యలు తెలుసుకొని, వారి రక్షణకు భరోసా ఇచ్చేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు.
 
కాగా, ప్రస్తుతం అధికారంలో ఉన్న తాత్కాలిక ప్రభుత్వానికి గతంలో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీని నిషేధించే ఆలోచన లేదని  సఖావత్‌ హుస్సేన్‌ స్పష్టం చేశారు. “ఆ పార్టీ బంగ్లాదేశ్‌కు పార్టీ అనేక సహకారాలు అందించింది. మేము దానిని అంగీకరిస్తున్నాము. సమయం వచ్చినప్పుడు ఆ పార్టీ ఎన్నికల్లో పాల్గొనాలని కోరుతున్నాము” అని ఆయన తెలిపారు.