నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్‌

నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్‌
* బెంగాల్ లో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారంపై భగ్గుమన్న రెసిడెంట్‌ డాక్టర్లు
 
పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారంపై రెసిడెంట్‌ డాక్టర్లు భగ్గమన్నారు. హత్యను నిరసిస్తూ సోమవారం దేశవ్యాప్తంగా పలు రకాల వైద్య సేవలను నిలిపివేయనున్నట్టు ది ఫెడరేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (ఫోర్డా) ప్రకటించింది. ‘ఆర్‌జీ కర్‌లోని మా సహచరులకు సంఘీభావంగా సోమవారం దేశవ్యాప్తంగా పలు రకాల వైద్యసేవలు నిలిపివేయాలని నిర్ణయించాం. ఇది తేలికగా తీసుకున్న నిర్ణయం కాదు. ఎలాంటి జాప్యం లేకుండా తమకు న్యాయం చేయాలన్న డిమాండ్‌తో ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని పేర్కొన్నది. 
 
ఆర్‌జీ వైద్యుల డిమాండ్లను పరిష్కరించాలని, నిరసన తెలుపుతున్న వైద్యులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని, బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలని, అన్ని దవాఖానల్లో వైద్యుల భద్రతకు కేంద్రం ప్రొటోకాల్‌ విడుదల చేయాలని ఫోర్డా డిమాండ్‌ చేసింది.  కోల్‌కతాలో ఆర్‌జీ కర్‌ కాలేజీలో 28 ఏండ్ల ట్రైనీ డాక్టర్‌ హత్యకు గురయ్యారు. శుక్రవారం రాత్రి అర్ధనగ్న స్థితిలో బాధితురాలి మృతదేహం లభ్యమైంది. ఆమెపై లైంగికదాడి జరిగినట్లు నిర్ధారణ అయింది. నిందితుడు సంజయ్‌రాయ్‌ని పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. 

శుక్రవారం రాత్రి అతడి విరిగిన ఇయర్‌ఫోన్‌ వైద్యురాలి హత్య జరిగిన సెమినార్‌ రూమ్‌లో దొరికింది. అదే అతడిని పట్టించింది. ఆ రోజు తెల్లవారుజామున 4 గంటలకు ఎమర్జెన్సీ భవనంలోకి వెళ్తున్నప్పుడు బ్లూటూత్‌ డివైజ్‌ అతని మెడలో ఉంది. 40 నిముషాల అనంతరం బయటకు వచ్చేటప్పుడు అది అతడి మెడలో లేదు. 

కొంతసేపు పెనుగులాట తర్వాత డాక్టర్‌ను గొంతు పిసికి చంపినట్టు నిందితుడు అంగీకరించాడని పోలీసులు చెప్పారు. ఆ సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడని తెలిపారు. సంజయ్‌ రాయ్‌కు ఇదివరకే నాలుగుసార్లు పెండ్లిండ్లు అయ్యాయి. అయితే అతని ప్రవర్తన కారణంగా ముగ్గురు భార్యలు అతడిని వదిలి వెళ్లిపోగా. నాలుగో భార్య గత ఏడాది మరణించింది. సంజయ్‌ రాయ్‌ పోలీస్‌ పౌర వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. పోకిరీ చేష్టలతో స్థానికులకు ఎప్పుడూ ఇబ్బందులు కలిగించేవాడని తెలిసింది.