బీహార్‌లోని జెహనాబాద్ జిల్లాలోని మఖ్దుంపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. బాబా సిద్ధనాథ్ ఆలయంలో సోమవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు మృతిచెందారు. మరో 50 మంది గాయపడ్డారు. వారితో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా అధికారులు హుటాహుటిన ఆలయానికి చేరుకుని భక్తుల్ని రక్షించేందుకు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు.
బాబా సిద్ధనాథ్ ఆలయ ప్రాంతాన్ని జెహనాబాద్ జిల్లా కలెక్టర్ అలంకృత పాండే సందర్శించారు. బాధితులకు తక్షణమే వైద్య సహాయం అందించాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుందని వెల్లడించారు.
ముందుగా కన్వారియాల మధ్య వాగ్వాదం జరిగిందని, చివరికి అది తొక్కిసలాటకు దారితీసిందని జిల్లా మేజిస్ట్రేట్ అలంకృత పాండే తెలిపారు. ఈ ఘటన ఆదివారం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో జరిగినట్లు తెలుస్తోందని అన్నారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చాయని పాండే తెలిపారు. మృతుల వివరాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.
మరణించినవారి కుటుంబ సభ్యులను కలిసి విచారిస్తున్నామని, మరికొంత మంది మృతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. సిద్ధనాథ్ ఆలయం వద్ద ఉన్న కొండపైకి ఎక్కుతుండగా మెట్లపై తొక్కిసలాట జరిగి గందరగోళ వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తున్నది. అయితే భక్తులను నియంత్రించడానికి ఆలయ సిబ్బంది లాఠీచార్జి చేయడంతోనే ఆ ఘటన చోటుచేసుకున్నట్లు ఆరోపిస్తున్నారు.
More Stories
బయటపడిన మావోయిస్టుల భారీ ఆయుధాల డంప్
99.1 కోట్లకు చేరిన భారత ఓటర్ల సంఖ్య
మహారాష్ట్రలో పుష్పక్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో 12 మంది మృతి