
బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం వార్తలపై తీవ్రంగా స్పందిస్తూ బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం మీడియా సృష్టే అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొట్టిపారేశారు. బీఆర్‌ఎస్ ఒక కాలం చెల్లిన పార్టీ అని విమర్శించారు. ఇప్పటివరకు విలీనం అలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు.
బిఆర్‌ఎస్ నాయకులు ఢిల్లీ వచ్చేది కవితను కలిసేందుకు మాత్రమే అని తెలిపారు. బెయిల్ మంజూరు చేయడం అనేది ప్రభుత్వం చేతిలో ఉంటే ఇక లా ఎందుకు? కోర్టు ఎందుకు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ను రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారనే నమ్మకం ఉందని, కేటీఆర్ చేసిన అరాచకాలు, అవినీతి అందరికీ తెలుసునని చెప్పారు .
తనతో సహా బీజేపీ కార్యకర్తలను కేటీఆర్ హింసించిన, జైల్లో వేసిన తీరును ఎవరూ మర్చిపోలేదని స్పష్టం చేశారు.రేవంత్‌పై నమ్మకం పోయిన రోజు నుండి కాంగ్రెస్ తో జరగబోయేది యుద్దమేనని ప్రకటించారు. కెటిఆర్‌ను లోపల వేయకుంటే కాంగ్రెస్‌కు గడ్డు కాలం తప్పదని హెచ్చరించారు.
కవిత బెయిల్‌కు, బీజేపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. సిసోడియాకు బెయిల్ వస్తే బీజేపీకి సంబంధముందా? అని ప్రశ్నించిన ఆయన కోర్టు విషయాలను పార్టీతో ముడిపెట్డడం సరికాదని హితవు పలికారు. నిజాయితీగా పనిచేసే ఐఏఎస్‌లకూ నేటికీ పోస్టింగ్ ఇవ్వడం లేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ కు కొమ్ముకాసిన ఐఏఎస్ లకే మళ్లీ మంచి పోస్టింగులిస్తున్నారని సంజయ్ ఆరోపించారు.
కాంగ్రెస్‌కు, బీఆర్‌ఎస్‌కు తేడా లేకుండా పోయిందని విమర్శించారు. అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత చూరగొన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని చెబుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని సంజయ్ స్పష్టం చేశారు.
పంచాయతీలకు నిధులిచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఏకగ్రీవ పంచాయతీలకు కూడా ప్రోత్సహక నిధులివ్వడం లేదని ధ్వజమెత్తారు. కేంద్ర నిధులతోనే పంచాయతీలు నడుస్తున్నాయని ఆయన తెలిపారు. గతంలో వక్ఫ్ బోర్డు భూములను కాంగ్రెస్, ఎంఐఎం నేతలు చాలా చోట్ల కబ్జా చేశారని ఆరోపించారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందితే. వాస్తవాలన్నీ బయటకు వస్తాయని తెలిపారు.
More Stories
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!
సిబిఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు?