17 నెలల తర్వాత సిసోడియాకు బెయిల్‌

17 నెలల తర్వాత సిసోడియాకు బెయిల్‌
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో అరెస్టై జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ సీనియర్‌ నేత మనీశ్ సిసోడియాకు ఎట్టకేలకు భారీ ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. రూ 10 లక్షల షూరిటీ కల్పించడంతో పాటు, ఇద్దరు హామీగా ఉండాలని తెలిపింది.
 
దేశం విడిచి వెళ్లొద్దని కోర్టు సూచించింది. పాస్‌పోర్ట్‌ సరెండర్‌ చేయాలని, సాక్షులను ప్రభావితం చేయరాదని ఆదేశించింది. క్రమంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాలని, ముఖ్యమంత్రి కార్యాలయం, సచివాలయంకు వెళ్లరాదని స్పష్టం చేసింది.  సుప్రీం తీర్పుతో 17 నెలలుగా జైలు జీవితాన్ని గడుపుతున్న సిసోడియాకు భారీ ఊరట లభించినట్లైంది. 
 
ఇప్పటికే ఈ కేసులో చాలావరకు అవసరమైన పత్రాలు దర్యాప్తు సంస్థల వద్ద ఉండడంతో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం తక్కువని కూడా కోర్టు అభిప్రాయపడింది. కాగా బెయిల్ మంజూరు చేసేవిషయంలో ట్రయిల్ కోర్ట్, హైకోర్టు అతిజాగ్రత్తగా వ్యవహరించడం పట్ల సుప్రీంకోర్టు తప్పు పడింది. “బెయిల్ ఒక నిబంధన, జైలు మినహాయింపు” అని స్పష్టం చేసింది. 17 నెలలుగా జైలులో ఉన్నప్పటికీ ఇంకా కేసు విచారణ ప్రారంభం కాకపోవడంతో 

వేగంగా విచారణ పొందే హక్కు కోల్పోయినట్లయిందని కోర్టు తెలిపింది.
 
ప్రముఖులు నిందితులుగా ఉన్న కేసులలో కూడా వేగవంతంగా నిస్పక్షపాతంగా విచారణ జరగాలని ఈ తీర్పుతో సుప్రీంకోర్టు స్పష్టం చేసిన్నట్లయింది. విచారణ జరపకుండా దీర్ఘకాలం జైలులో ఉంచడం ఆమోదయోగ్యం కాదనే సంకేతం ఇచ్చిన్నట్లయింది.  కాగా, మద్యం కుంభకోణం కేసులో గతేడాది ఫిబ్రవరి 26న సిసోడియాను అధికారులు అరెస్ట్‌ చేశారు. అప్పటి నుంచి తీహార్‌ జైల్లోనే ఉంటున్నారు.
ఈ క్రమంలో బెయిల్‌ కోసం అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో 17 నెలల తర్వాత ఆయనకు ఇప్పుడు ఉపశమనం లభించింది. నూతన మద్యం పాలసీలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సిసోడియాను పలుమార్లు విచారించిన సీబీఐ 2023, ఫిబ్రవరి 26న అరెస్టు చేసింది. విచారణ సమయంలో సీఎం పదవిని ఆశజూపి ఆప్‌ను లొంగదీసుకొనేందుకు బీజేపీ కుట్రకు తెర తీసిందని అరెస్టుకు ముందు సిసోడియా ఆరోపించారు. 

ఆప్‌ను వీడాలని సీబీఐ అధికారులు తనపై ఒత్తిడి చేశారని 2022 అక్టోబర్‌ 17న సిసోడియా తెలిపారు. బీజేపీలోకి వస్తే, ఢిల్లీ సీఎం పోస్టు ఇస్తామని ఆఫర్‌ చేశారని, లేకుంటే జైలుకు పంపిస్తామని బెదిరించారని పేర్కొన్నారు.