
* రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ ప్రశంసలు
నాలుగేండ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో ఎలాంటి అంచనాలూ లేకుండా బరిలోకి దిగి బరిసెతో భారత్‌కు అథ్లెటిక్స్‌లో తొలి స్వర్ణం అందించిన ‘గోల్డెన్ బాయ్’ నీరజ్ చోప్రా పారిస్‌లోనూ రజతంతో మెరిశాడు. స్టేట్ డి ఫ్రాన్స్ వేదికగా గురువారం అర్ధరాత్రి జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ రెండో ప్రయత్నంలో 89.45 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంతో సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నాడు.
వరుసగా రెండో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన నీరజ్ తుదిపోరులో అంచనాలను ఆశించిన స్థాయిలో అందుకోలేకపోయాడు. పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ ఒలింపిక్స్‌లో మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా 92.97 మీటర్ల రికార్డు త్రో తో పసిడి సొంతం చేసుకున్నాడు. కెన్యా అథ్లెట్ పీటర్స్ అండర్సన్ 88.54 మీటర్ల దూరం విసిరి కాంస్యం గెలుచుకున్నాడు.
తాజా ఎడిషన్‌లో భారత్‌కు ఇది ఐదో పతకం కాగా మొదటి రజతం. హాకీ జట్టుతో పాటు షూటింగ్లో 3 కాంస్యాలు వచ్చాయి. తొలి ప్రయత్నంలో బరిసెను అందుకున్న నీరజ్‌తో పాటు అర్షద్ త్రోలు ఫౌల్ అయ్యాయి. కానీ రెండో ప్రయత్నంలో మాత్రం నదీమ్ రెచ్చిపోయాడు. అతడు విసిరిన ఈట ఒలింపిక్ పాత రికార్డులన్నింటినీ చెరిపేసింది.
విశ్వక్రీడల చరిత్రలో ఇదే అత్యుత్తమం. తద్వారా అతడు 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ఆండ్రీస్ (నార్వే) విసిరిన 90.57 మీటర్ల రికార్డు బ్రేక్ అయింది. ‘టోక్యో’లో నీరజ్ స్వర్ణం గెలవగా అర్షద్ ఐదో స్థానంలో నిలవగా పారిస్‌లో మాత్రం అర్షద్ పసిడి పట్టుకుపోయాడు. అర్షద్ తర్వాతే వచ్చి జావెలిన్‌ను అందుకున్న నీరజ్.. తన అనుభవన్నంతా ఉపయోగించి 89.45 మీటర్ల త్రో విసిరాడు.
కానీ ఆ తర్వాత నీరజ్ వేసిన నాలుగు త్రో లు ఫౌలే కావడం గమనార్హం. రెండో త్రో తో రికార్డు సృష్టించిన నదీమ్.. ఆరోసారీ 91.79 మీటర్ల దూరం విసిరి రెండుసార్లు 90 మీటర్ల మార్కును దాటడం విశేషం. గత ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన జాకబ్ వెద్లిచ్ ఈసారి (88.50 మీటర్లు) నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. వరుస ఒలింపిక్స్‌లో నీరజ్ రెండు పతకాలు అందుకోవడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఎక్స్‌లో పోస్టు చేస్తూ నీరజ్‌ను కొనియాడారు.
“నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. అతడిని అభినందనలు. వరుస ఒలింపిక్స్ గేమ్స్‌లో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించిన తొలి భారత అథ్లెట్‌గా సెన్సేషనల్ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. నీరజ్‌ను చూసి భారత దేశమంతా గర్విస్తోంది. వచ్చే తరాలకు అతడి సాధించిన ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది. రాబోయే రోజుల్లోనూ భారత్‌కు అతడు మరిన్ని పతకాలు సాధించాలని, కీర్తిని తీసుకురావాలని దేశమంతా ఎదురు చూస్తోంది” అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన ఎక్స్‌లో రాసుకొచ్చారు.
“నీరజ్ చోప్రా నువ్వు అద్భతమైన వ్యక్తివి. ఇతడు తన ప్రతిభను మళ్లీ నిరూపించాడు. అతడు మరో ఒలింపిక్ మెడల్ సాధించి భారత్‌ను గర్వించేలా చేశాడు. సిల్వర్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రాకు అభినందనలు. భవిష్యత్‌లో రాబోయే అథ్లెట్లు తమ కలలను నెరవేర్చు కోవడానికి, అలానే భారత్‌ను గర్వపడేలా చేయడానికి నీరజ్ స్ఫూర్తి కొనసాగుతూనే ఉంటుంది” అని మోదీ ప్రశంసలు కురిపించడంతో పాటు హర్షం వ్యక్తం చేశారు.
More Stories
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు