
ఉవ్వెత్తున ఎగసిన విద్యార్ధుల ఆందోళనలు, హింస, నిర్బంధాల నడుమ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశాక బాంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా పార్లమెంటును రద్దు చేశారు. రక్షణ రంగానికి చెందిన అధిపతులు, వివిధ పార్టీల నేతలు, విద్యార్థి సంఘ నాయకులు, పౌర సమాజ ప్రతినిధులతో చర్చించిన మీదట పార్లమెంటును రద్దు చేయాలని నిర్ణయించినట్లు అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ తెలిపారు.
తాత్కాలిక ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ (84)ను నియమించారు. ఈ మేరకు మంగళవారం ఆర్థరాత్రి అధ్యక్షుడి ప్రెస్ సెక్రటరీ ప్రకటన చేశారు. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ సైన్యం నేతృత్వం వహించే ఏ తాత్కాలిక ప్రభుత్వమూ తమకు ఆమోద యోగ్యం కాదని హసీనా వ్యతిరేక ఆందోళనలకు నాయకత్వం వహించిన విద్యార్థి సంఘం నేతలు మంగళవారం స్పష్టం చేయడంతో ఆర్మీ మల్లగుల్లాలు పడుతోంది.
ఈ విషయమై ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ విద్యార్థి నేతలతో చర్చలు జరపనున్నట్లు మిలిటరీ వర్గాలు తెలిపాయి. నిరసనకారుల డిమాండ్ మేరకు మాజీ ప్రధాని, ప్రతిపక్ష బిఎన్‌పి నేత బేగం ఖలీదా జియాను గృహ నిర్బంధం నుంచి విడుదలజేశారు. ప్రజాతంత్రయుతంగా అధికార మార్పిడి జరగాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.
సోమవారం హింసాత్మక ఘటనల్లో మరో 113 మంది చనిపోవడంతో గత నెల రోజులుగా సాగుతున్న ఈ ఆందోళనల్లో చనిపోయినవారి సంఖ్య 440కి పెరిగింది. రాజకీయ ఖైదీల విడుదల కోసం ఆ కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. గత కొన్ని రోజులుగా నెలకొన్న రాజకీయ కల్లోలం నుంచి బంగ్లాదేశ్ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది.
మంగళవారం ఢాకా వీధుల్లో శాంతియుత పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి. వాహనాల రాకపోకలు ఎప్పటిలానే సాగుతున్నాయి. నిలిచిపోయిన విమాన సర్వీసులను పునరుద్ధరించడంతో దుస్తుల తయారీ ఫ్యాక్టరీలు తిరిగి పనిచేయనారంభించాయి.
తాత్కాలిక ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా బాధ్యతలు చేపట్టేందుకు నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ సుముఖత తెలిపారు. దీనిపై ఆయన స్పందిస్తూ ”విద్యార్ధులు తీవ్రంగా ఆందోళనలు చేస్తున్నారు. అందుకు వారు మూల్యం కూడా చెల్లించారు. విద్యార్ధులే ఇంతలా త్యాగాలు చేస్తే, నేను కూడా కొంత బాధ్యత తీసుకుంటాను. ఈ తాత్కాలిక ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా వుంటాను.” అని పేర్కొన్నారు.
2007లో బంగ్లాదేశ్ రాజకీయ నేతలపై విమర్శలు గుప్పించిన యూనస్ సొంత పార్టీని స్థాపిస్తానని ప్రకటించి తర్వాత వెనక్కుతగ్గారు. కాగా, ఆయనకు చెందిన గ్రామీణ్ టెలికం అనే కంపెనీలో కార్మిక సంక్షేమ నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో జనవరిలో ఆయనను అరెస్టు చేయగా బెయిల్‌పై బయటకు వచ్చారు.
More Stories
డల్లాస్లో భారత సంతతి వ్యక్తి హత్య ఖండించిన ట్రంప్
గ్రాండ్ స్విస్ విజేత వైశాలి.. వరుసగా రెండో టైటిల్
ముగ్గురు మంత్రులతో నేపాల్ మంత్రివర్గం విస్తరణ