
ప్రముఖ భరతనాట్యం, కూచిపూడి కళాకారిణి యామిని కృష్ణమూర్తి (84) కన్నుమూశారు. వయస్సురీత్యా అనారోగ్య సమస్యలతో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె గత కొంత కాలంగా వయోభార సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆమె శనివారం సాయంత్రం ఢిల్లీలో కన్నుమూశారు. యామినీ కృష్ణమూర్తి భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో నిష్ణాతురాలు.
కూచిపూడి నృత్యానికి దేశవిదేశాలలో ఎంతో పేరు తెచ్చిపెట్టారు. కర్ణాటక సంగీతం నేర్చుకుని, పాటపాడుతూ నృత్య ప్రదర్శనలు ఇచ్చేవారు. సత్యభామగా ఆమెను తప్ప మరొకరని ఊహించకోలేనంతగా కూచిపూడి కళారూపానికి ఆమె గుర్తింపు తీసుకొచ్చారు. ఆమె కేవలం నర్తకి మాత్రమే కాదు, బహుముఖ ప్రజ్ఞాశాలి. శాస్త్రీయ గానం, వీణ వాయిద్యంలో తర్ఫీదుపొందారు.
ఐదేళ్ల వయసులోనే చెన్నైలోని కళాక్షేత్ర స్కూల్ ఆఫ్ డ్యాన్స్‌లో భరతనాట్యం శిక్షణ తీసుకున్నారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. 1957లో మద్రాస్‌లో తొలి ప్రదర్శన ఇచ్చిన ఆమె తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. తన ప్రతిభతో టీటీడీ ఆస్థాన నర్తకిగా ఎదిగారు. భరతనాట్యంలో విశేష ప్రావీణ్యం సంపాదించిన తర్వాత కూచిపూడిలోనూ రాణించారు.
యామినీ కృష్ణమూర్తి ఎంతోమంది ఔత్సాహిక యువతులకు నాట్యంలో శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దారు. డిల్లీలో ‘యామినీ స్కూల్ ఆఫ్ డ్యాన్స్’ స్థాపించి నృత్యంలో ఎంతో మందికి శిక్షణ ఇచ్చారు. ఏ ప్యాషన్ ఫర్ డ్యాన్స్ పేరుతో పుస్తకం రచించారు. ఆమెకు భారతీయ కళారంగానికి చేసిన సేవకు కేంద్రం తొలిసారిగా 1968లో పద్మశ్రీతో సత్కరించింది. 2001లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాలను అందింది. అలాగే, 1977లో సంగీత నాటక అకాడమీ అవార్డును సైతం అందుకున్నారు.
యామినీ కృష్ణమూర్తి చిత్తూరు జిల్లా మదనపల్లెలో 1940 డిసెంబరు 20న జన్మించారు. ఆమె తండ్రి కృష్ణమూర్తి సంస్కృత పండితుడు. అనంతరం వీరి కుటుంబం తమిళనాడులోని చిదంబరంలో స్థిరపడ్డారు. అప్పటి నుంచి దేశవిదేశాల్లో వేలాది ప్రదర్శనలిచ్చి పేరు ప్రఖ్యాతలు పొందారు.
ప్రముఖ భరతనాట్య, కూచిపూడి నర్తకిగా ఖ్యాతిగాంచిన యామినీ కృష్ణమూర్తి గారి మృతి పట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఢిల్లీలో ‘యామినీ స్కూల్ ఆఫ్ డ్యాన్స్’ స్థాపించి నృత్యంలో ఎంతో మందికి శిక్షణ ఇచ్చారని చెబుతూ కళారంగానికి ఆమె అందించిన సేవలను కొనియాడారు.
భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో ఆమె నిష్ణాతురాలు అంటూ ఆమె మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కూచిపూడి నృత్యానికి దేశవిదేశాలలో ఎనలేని పేరు తెచ్చిపెట్టింది కూడా యామినీ కృష్ణమూర్తి అంటూ ఆమె లేని లోటు నృత్య కళా రంగంలో ఎవరూ తీర్చలేరని చెప్పారు.
More Stories
ఉగ్రవాదంపై విజయానికి ప్రతీక ఆపరేషన్ సిందూర్
ఖర్గేను పరామర్శించిన ప్రధాని మోదీ
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి