వరంగల్‌, కరీంనగర్‌లకు రూ.వెయ్యికోట్లు

వరంగల్‌, కరీంనగర్‌లకు రూ.వెయ్యికోట్లు

స్మార్ట్‌ సిటీ మిషన్‌ కింద ఎంపికైన గ్రేటర్‌ వరంగల్‌, కరీంనగర్‌లకు రూ. వెయ్యి కోట్లు కేటాయించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌ సోమవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల సహాయ మంత్రి టోకన్‌ సాహు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.  రెండు నగరాల్లో మొత్తం రూ.2,725 కోట్ల విలువైన 145 ప్రాజెక్టులను చేపట్టి అందులో రూ.2,125 కోట్ల విలువైన 88 ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసినట్లు వెల్లడించారు.

స్మార్ట్‌ సిటీ మిషన్‌ను వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించినట్లు మంత్రి పేర్కొన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు నగరాలకు ఈ పథకం కింద 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.562 కోట్ల బడ్జెట్‌ అంచనాలను రూపొందించింది. గ్రేటర్‌ వరంగల్‌ నగరానికి రూ.358.58 కోట్లు, కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు రూ.203.76 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది

కాగా, శ్రావణపల్లి బొగ్గు గనిని సింగరేణికి కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమకు విజ్ఞప్తి చేసిందని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్‌ సోమవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర బొగు, గనుల మంత్రి జి.కిషన్‌రెడ్డి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. వేలం వేసే బొగ్గు గనుల జాబితా నుంచి శ్రావణపల్లి బొగ్గు గనిని తొలగించాలని కోరినట్లు తెలిపారు. ప్రస్తుత విధానం ప్రకారం బొగ్గు గనులన్నిటినీ వేలం ద్వారా కేటాయిస్తున్నట్లు తెలిపారు. సింగరేణి సహా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఆ వేలంలో పాల్గొని నిర్దేశిత నిబంధనల ప్రకారం బొగ్గు గనులను తీసుకోవచ్చని తెలిపారు.