
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో ఇక నుండి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పట్టాదారు పాసు పుస్తకాల ముద్రణపై కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో ప్రభుత్వ రాజముద్రతో భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందించాలని నిర్ణయించారు.
భూముల రీ సర్వే పేరుతో గత ప్రభుత్వం పొలాల సర్వే చేయించిదని, ఇందుకోసం భారీగా నిధులు ఖర్చు చేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సర్వేకు వాడిన సరిహద్దు రాళ్లపై జగన్ తన బొమ్మలు ముద్రించుకున్నారని, దాని కోసం రూ.650 కోట్లు ఖర్చు చేశారని అధికారులు సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారు. అయితే కేంద్రం చెప్పిన రీసర్వేలో ఎక్కడా సరిహద్దు రాళ్లు పాతమని చెప్పలేదన్నారు.
అయితే ప్రచారం కోసం జగన్ తన బొమ్మలతో గ్రానైట్ రాళ్లను సిద్ధం చేశారని చంద్రబాబు విమర్శించారు. జగన్ బొమ్మతో ఉన్న 77 లక్షల గ్రానైట్ రాళ్లను ఏం చేయాలనేదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఆ రాళ్లపై జగన్ బొమ్మలు చెరపడానికి మరో రూ.15 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు తాత్కాలికంగా అంచనా వేశారు. జగన్ ప్రచార పిచ్చి వల్ల ప్రజాధనం రూ.700 కోట్ల వరకు వృధా అయిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.
“పట్టాదారు పాసు పుస్తకాలను ఇకపై రాజముద్రతో జారీ చేస్తాం. వైసీపీ ప్రభుత్వం జగన్ బొమ్మతో పాసు పుస్తకాలు ఇచ్చింది. జగన్ ఫొటో పిచ్చితో ప్రజాధనం వృధా అయ్యింది. కొత్త పాసు పుస్తకాలలో క్యూ ఆర్ కోడ్ వస్తుంది. ఇందులో భూమి విస్తీర్ణం, యాజమాని వివరాలు అన్ని ఉంటాయి. కొత్త టెక్నాలజీ అమలు చేస్తున్నారు. దీనికి రూ.20 కోట్లు వ్యయం అవుతుంది. గత ప్రభుత్వంలో వాళ్ల అనుయాయులు కోసం 22ఏ తో కొత్త చట్టాలు తీసుకొచ్చారు” అని రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
విశాఖ, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరులో భూముల అవకతవలు, అసైన్డ్ భూముల వ్యవహారంపై ప్రభుత్వ అధికారులు పర్యటించి వివరాలు సేకరిస్తారని చెప్పారు. ప్రజల నుంచి ఫిర్యాదు కూడా తీసుకుంటారని, గత ప్రభుత్వంలో భూముల అవకతవకలపై విచారణ చేపడతామని స్పష్టం చేశారు. గత పాలకులు భూదాహంతో రెవెన్యూ శాఖను నాశనం చేశారని మండిపడ్డారు. భూముల అవకతవకలపై దర్యాప్తు చేసి దోషులను చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు