
* మృతులకు రూ. 10 లక్షల నష్టపరిహారం.. హోంశాఖ దర్యాప్తు కమిటీ
ఢిల్లీలోని రావూస్ సివిల్స్ కోచింగ్ సెంటర్‌లోకి వచ్చిన వరదతో ముగ్గురు అభ్యర్థులు మరణించిన ఘటనపై పార్లమెంటు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సోమవారం రాజ్యసభలో ఈ ఘటనపై చర్చ జరగ్గా, లోక్‌సభలో వివిధ పార్టీల సభ్యులు ఇదే అంశంపై మాట్లాడారు. ఈ ఘటనపై రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా మాట్లాడుతూ కోచింగ్ సెంటర్ల వర్క్ కల్చర్ ప్రస్తుతం గ్యాస్ ఛాంబర్‌గా మారిందని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇచ్చేందుకు కోచింగ్ సెంటర్లకు ఇంత పెద్దమొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వస్తోందో దర్యాప్తు చేయాలని ఆయన సూచించారు. సోమవారం రాజ్యసభలో ఢిల్లీలో సివిల్స్‌కు సిద్ధమవుతున్న ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటియుగంలో శిక్షణ వాస్తవానికి వ్యాపారంగా సాధనంగా మారిందని తాను భావిస్తున్నానని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
నేటి యుగంలో కోచింగ్ వ్యాపారం అధిక సంపాదనతో వర్ధిల్లుతోందని.. మనం వార్తాపత్రికలను చదివినప్పుడల్లా, మొదటి పేజీలో కోచింగ్ వ్యాపారానికి సంబంధించిన ప్రకటనలను చూస్తుంటామని ఆయన గుర్తు చేశారు. ప్రకటనలకు వెచ్చించే ప్రతి పైసా విద్యార్థుల నుంచే వస్తోందని.. కోచింగ్ కోసం నిర్మిస్తున్న ప్రతి భవనం విద్యార్థుల సొమ్ముతో నిర్మిస్తున్నారని స్పష్టం చేశారు.
కోచింగ్ వర్క్ కల్చర్ ఇప్పుడు గ్యాస్ ఛాంబర్‌గా మారిపోయిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అవకాశాలు పొందే రంగం విస్తరిస్తున్న దేశంలో కోచింగ్ సమస్యగా మారుతోందని చెబుతూ దేశంలోని ఇతర ఉపాధి అవకాశాల గురించి యువతకు తెలియజేయాలని జగదీప్ ధన్‌ఖర్ రాజ్యసభ సభ్యులను అభ్యర్థించారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజ్యసభలో ఈ అంశంపై మాట్లాడుతూ, ఐఏఎస్ విద్యార్థుల దుర్మరణానికి నిర్లక్ష్యమే కారణమని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులను గుర్తించాలని, ఇందులో రాజకీయాలకు తావీయరాదని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం జరిగినప్పుడు దీనికి ఎవరో ఒకరు బాధ్యత వహించాలని, అందువల్ల పరిష్కారం కనుగొనవచ్చునని చెప్పారు. అంతకుముందు, ఢిల్లీలోని కోచింగ్ సెంటర్‌లో జరిగిన సంఘటనపై చర్చించడానికి సుధాన్షు త్రివేది, స్వాతి మలివాల్‌తో సహా ఇతర రాజ్యసభ సభ్యులు రూల్ నంబర్ 267 కింద నోటీసులు ఇచ్చారు.
లోక్‌సభలో ఎస్‌పి నేత అఖిలేష్ యాదవ్ కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సరైన ప్లానింగ్ లేని ఇలాంటి భవనాలకు నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడం కచ్చితంగా సంబంధిత అధికారుల బాధ్యతారాహిత్యం. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిపై ఉంది..? ప్రభుత్వంపై లేదా..?’ అని ప్రశ్నించారు.
బిజెపి ఎంపి బన్సూరీ స్వరాజ్ మాట్లాడుతూ.. దశాబ్దకాలంగా ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే యుపిఎస్‌సి విద్యార్థులు మరణించారని ఆరోపించారు. ఈ విషయంపై దర్యాప్తు చేపట్టేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని హోంమంత్రిత్వ శాఖను కోరారు. కాంగ్రెస్ నేత శశిథరూర్ మాట్లాడుతూ ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా, పాత రాజేంద్రనగర్‌లో ఒక కోచింగ్ సెంటర్ సెల్లార్‌లోకి వరద నీరు ముంచెత్తడంతో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు సివిల్ సర్వీసెస్ ఆశావహుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్‌జి) వికె సక్సేనా ప్రకటించారు. ఈ విషాద ఘటనపై నిరసన తెలియచేస్తున్న విద్యార్థులను కలుసుకున్న ఎల్‌జి 24 గంటల్లోపల ఇందుకు బాధ్యులైన ఢిల్లీ అగ్ని మాపక సర్వీసు, పోలీసు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు రాజ్ నివాస్ ఒక ప్రకటనలో తెలిపింది. భవన నిబంధనలను ఉల్లంఘించిన అన్ని అక్రమ కట్టడాలను, బేస్‌మెంట్లను మూసివేస్తామని ప్రకటనలో తెలిపారు.
కాగా, ఢిల్లీ ఘటనకు సంబంధించిన సోమవారంనాడు ఐదుగురు నిందితులను అరెస్టు చేయగా, కోర్టు వారిని 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై సమగ్ర విచారణకు ఒక కమిటీని కేంద్ర హోం శాఖ నియమించింది.
ఇలా ఉండగా, ఘటనకు దారితీసిన కారణాలు, బాధ్యులను గుర్తించడం, చర్యలు సూచించడం, పాలసీ మార్పులను సిఫారసు చేయడం వంటి బాధ్యతలను కమిటీకి అప్పగించినట్టు సామాజిక మాద్యమం ‘ఎక్స్’లో ఎంహెచ్ఏ ప్రతినిధి తెలిపారు. కేంద్ర కమిటీలో అడిషనల్ సెక్రటరీ ఎంఓయూహెచ్ఏ, ప్రిన్సిపల్ సెక్రటరీ (హోమ్), ఢిల్లీ గవర్నమెంట్, స్పెషల్ సీపీ, ఢిల్లీ పోలీస్, ఫైర్ అడ్వయిజర్, జేఎస్, ఎఎంహెచ్ఓ కన్వీనర్‌గా ఉంటారు. 30 రోజుల్లోగా కమిటీ నివేదిక అందిస్తు్ందని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు