
ప్రపంచమంతా అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న పారిస్ ఒలింపిక్స్ అంగరంగ వైభవంగా ప్రారంభమైపోయాయి. ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారి ఫ్రాన్స్‌లోని నదిలో ఆరంభ వేడుకలు నిర్వహించారు. సెన్ నది వేదికగా 6 కి.మీ పొడవునా దాదాపు 100 పడవల్లో 205 దేశాల క్రీడాకారులు పరేడ్ నిర్వహించారు. ఆరంభ వేడుకల్లో మొత్తం 3 వేల మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు.
ప్రారంభ వేడుకల కోసం పరేడ్ ఆఫ్ నేషన్స్లోకి ప్రవేశించిన భారత బృందం ప్రదర్శనను ఆకట్టుకొంది. ప్యారిస్ 33వ సమ్మర్ గేమ్స్‌ను అపూర్వమైన ఈవెంట్‌తో ప్రారంభించినప్పుడు ఫ్లాగ్ బేరర్లు పివి సింధు, శరత్ కమల్‌లు సెయిన్ నది వద్ద బోట్లో టీమ్ ఇండియాను నడిపించారు.
ఈ విశ్వక్రీడల్లో 32 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. అలానే ఈ ఒలింపిక్స్ పోటీలను భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రెండంకెల పతకాలే లక్ష్యంగా భారత క్రీడాకారులు రంగంలోకి దిగి తమ సత్తా చాటాలని ఎదురుచూస్తున్నారు. మొత్తంగా భారత్ తరఫున 117 మంది అథ్లెట్లు ఈ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు.
ఈ వేడుకల్లో భారత అథ్లెట్లు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్నారు. భారత పురుష అథ్లెట్లు కుర్తా బుండీ ధరించి ఫొటోలకు పోజులిచ్చారు. మహిళా అథ్లెట్లు చీర ధరించారు. భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్, తెలుగమ్మాయి పీవీ సింధు చీర కట్టులో కనిపించి ఆకట్టుకుంది. ఈమె ఓపెనింగ్ సెర్మనీలో భారత బృందానికి ఫ్లాగ్ బేరర్‌గా ఉంది.
మొత్తంగా ఈ సంప్రదాయ దుస్తుల్లోనే ఓపెనింగ్ సెర్మనీలో వీరంతా మార్చ్ చేశారు. భారతీయత ఉట్టిపడేలా త్రివర్ణ పతాకం రంగులు ఈ దుస్తులపై ఉండటం విశేషం. కాగా, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఈ ఫొటోలోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మన అథ్లెట్లను ప్రోత్సహించండి అంటూ కోరింది.
ఓపెనింగ్ సెరిమనీలో భాగంగా జరిగిన పరేడ్‌లో భారత్ అథ్లెట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ దిగ్గజం శరత్ కమల్ పతాకధారులుగా వ్యవహరించారు. వీళ్ల వెనకాల మన అథ్లెట్లతో పడవ సాగిపోయింది. అయితే శనివారం రేస్ ఉండటం వల్ల రోయర్ బాల్‌రాజ్ ప్రారంభోత్సవానికి దూరంగా ఉన్నాడు.
న్యూజిలాండ్‌తో మ్యాచ్ కారణంగా భారత హాకీ ఆటగాళ్లలో ముగ్గురు రిజర్వ్ ప్లేయర్లు మాత్రమే ఈ సంబరాల్లో పాల్గొన్నారు. భారత ట్రాక్ అండ్ ఫీల్డ్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్ అథ్లెట్లు కూడా ఇంకా పారిస్ చేరుకోలేదు.
సెన్ నదిపై 6 కిలోమీటర్ల పాటు జరిగిన పరేడ్ లో దాదాపు 85 పడవలపై 6800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ వేడుకలను చూసేందుకు దాదాపు 3,20,000 మందికి పైగా ప్రేక్షకులు హాజరై సందడి చేశారు. ఒలింపిక్ చరిత్రలోనే ఇదే అత్యధికం. ఈ వేడుకకు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రమఖులు, దేశాధినేతలు, వేలాది మంది ప్రదర్శనకారులు హాజరై సందడి చేశారు.
ఫ్రాన్స్ ప్రధాని ఎమాన్యుయెల్ మక్రాన్, అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య(ఐవోసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ అతిథులతో పాటు అభిమానులను చేతులు ఊపుతూ మార్చ్‌పాస్ట్‌కు స్వాగతం పలికారు. వివిధ దేశాలకు చెందిన అధ్యక్షులు, ప్రధానులు, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.
More Stories
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
యాసిన్ మాలిక్ ను `శాంతిదూత’గా అభివర్ణించిన మన్మోహన్!