ఉగ్ర‌వాదుల్ని మా సైనికులు అణిచివేస్తారు

ఉగ్ర‌వాదుల్ని మా సైనికులు అణిచివేస్తారు

* అగ్నిపథ్‌పై ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టిన ప్రధాని

పూర్తి స్థాయి ద‌ళాల‌తో ఉగ్ర‌వాదుల్ని తమ సైనికులు అణిచివేస్తార‌ని, శ‌త్రువుకు బ‌ల‌మైన స‌మాధానం ఇస్తామ‌ని ప్ర‌ధాని నరేంద్ర మోదీ  పొరుగు దేశం పాకిస్థాన్‌కు బలమైన హెచ్చరిక చేశారు. ఈ ఏడాది జులై 26వ తేదీతో కార్గిల్ యుద్దం ముగిసి 25 ఏళ్లు అయింది. ఈ యుద్ధంలో మృతి చెందిన జవాన్లు కోసం ద్రాస్ సెక్టర్‌లోని నిర్మించిన కార్గిల్ స్మారక స్థూపం వద్ద ప్రధాని మోదీ వారికి ఘనంగా నివాళులర్పించారు.
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ పాకిస్థాన్ నేరాల‌కు పాల్ప‌డి గ‌తంలో విఫలం అయ్యింద‌ని చెప్పారు.  కానీ ఆ చ‌రిత్ర నుంచి ఆ దేశం ఏమీ నేర్చుకోలేద‌ని ప్ర‌ధాని మోదీ పేర్కొన్నారు. ఉగ్ర‌వాదం, ప్ర‌చ్ఛ‌న్న యుద్ధంతోనే ఆ దేశం జీవనం చేస్తోంద‌ని విమ‌ర్శించారు.  తాను మాట్లాడే ప్ర‌దేశం నుంచి ఉగ్ర‌దాడుల‌కు పాల్ప‌డుతున్న ముఠా నేత‌లు త‌న స్వ‌రాన్ని నేరుగా వింటార‌ని పేర్కొంటూ ఉగ్ర‌వాదానికి ఊతం ఇస్తున్న దేశాల‌కు ఓ విష‌యాన్ని చెప్ప‌ద‌లుచుకున్నాన‌ని, ఆ దేశ కుంచిత ఆలోచ‌న‌లు ఎన్న‌టికీ విజ‌యవంతం కావు అని ప్ర‌ధాని స్పష్టం చేశారు.
 
ల‌డాఖ్ అయినా, జ‌మ్మూక‌శ్మీర్ అయినా, అభివృద్ధికి అడ్డు వ‌చ్చే ఎటువంటి స‌వాల్‌ను అయినా భారత్ ఓడిస్తుంద‌ని మోదీ హెచ్చరించారు. ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేసి ఆగ‌స్టు 5వ తేదీ నాటికి అయిదేళ్లు అవుతుంద‌ని, జ‌మ్మూక‌శ్మీర్ ప్ర‌జ‌లు కొత్త భ‌విష్య‌త్తు, కొత్త క‌ల‌ల గురించి మాట్లాడుకుంటున్నార‌ని ప్రధాని తెలిపారు. మౌళిక స‌దుపాయాల అభివృద్ధి, ప‌ర్యాట‌క రంగం.. ల‌డాఖ్‌, జేకేలో వేగంగా వృద్ధి చెందుతోంద‌ని చెప్పారు. 
 
క‌శ్మీర్‌లో కొన్ని ద‌శాబ్ధాల త‌ర్వాత సినిమా హాల్‌ను తెరిచిన‌ట్లు చెప్పారు. 35 ఏళ్ల త‌ర్వాత శ్రీన‌గ‌ర్‌లో తాజియా ఊరేగింపు జ‌రిగింద‌ని తెలిపారు. కాగా,  అగ్నిపథ్ పథకంపై ప్రతిపక్షాల చేస్తున్న విమర్శలను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఈ పథకంపై యువతను తప్పు దోవ పట్టించే విధంగా ఆ యా పార్టీలు వ్యవహరిస్తున్నాయంటూ ప్రతిపక్షాలపై ఆయన మండిపడ్డారు.
 
విప‌క్షాలు ఆర్మీని బ‌ల‌హీన‌ప‌రుస్తున్నాయ‌ని విచారం వ్యక్తం చేశారు. కొంద‌రు వ్య‌క్తుల ఆలోచ‌న‌ల‌కు ఏమైందో తెలియ‌డం లేద‌ని, పెన్ష‌న్ డ‌బ్బుల‌ను ఆదా చేసేందుకు ఈ స్కీమ్‌ను ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు అబ‌ద్దాలు ప్ర‌చారం చేస్తున్నార‌ని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త‌గా రిక్రూట్ అయిన‌వాళ్ల‌కు పెన్ష‌న్ అనే అంశం 30 ఏళ్ల త‌ర్వాత ఉత్ప‌న్నం అవుతుంద‌ని గుర్తు చేశారు. ఆర్మీ తీసుకున్న నిర్ణ‌యాన్ని గౌర‌వించామ‌ని, రాష్ట్ర‌నీతి కోసం ప‌నిచేస్తాం కానీ రాజ‌నీతి కోసం కాద‌ని స్పష్టం చేశారు.
 
వ‌న్ ర్యాంక్ వ‌న్ పెన్ష‌న్ విధానం గురించి కూడా ప్ర‌తిప‌క్షాలు అబ‌ద్దాలు ప్ర‌చారం చేశాయ‌ని చెబుతూ త‌మ ప్ర‌భుత్వ‌మే ఆ స్కీమ్‌ను అమ‌లు చేసింద‌ని గుర్తు చేశారు. వ‌న్ ర్యాంక్ వ‌న్ పెన్ష‌న్ స్కీమ్ కింద మాజీ సైనికుల‌కు  రూ.1.25 ల‌క్ష‌ల కోట్లు చెల్లించామ‌ని పేర్కొన్నారు. స‌ర్కారును విమ‌ర్శిస్తున్న ఆ పార్టీలు యుద్ధ స్మార‌కం నిర్మించ‌లేద‌ని విమర్శించారు. సరిహద్దులో ఉంటున్న సైనికుల‌కు అవ‌స‌ర‌మైన‌న్ని బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ల‌ను ఇవ్వ‌లేక‌పోయిన‌ట్లు విమ‌ర్శించారు.
 
ఆర్మీ తీసుకున్న సంస్క‌ర‌ణ‌ల్లో అగ్నిప‌థ్ స్కీమ్ కూడా భాగమేన‌ని ప్రధాని స్పష్టం చేశారు. ఆర్మీ అంటే కేవ‌లం రాజ‌కీయ‌వేత్త‌ల‌కు సెల్యూట్ చేయ‌డం, ప‌రేడ్‌ల్లో పాల్గొన‌డం అనే ఆలోచ‌న‌లో కొంద‌రు ఉన్నార‌ని, కానీ ఆర్మీ అంటే 140 కోట్ల భార‌తీయుల న‌మ్మ‌కం అని మోదీ తెలిపారు. సైన్యాన్ని ఎప్పుడూ య‌వ్వ‌నంగా ఉంచాల‌న్న ల‌క్ష్యంతోనే అగ్నిప‌థ్ స్కీమ్‌ను ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు చెప్పారు. 
 
నిరంత‌రంగా ఆర్మీని యుద్ధం కోసం ఫిట్‌గా ఉంచేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. దుర‌దృష్ట‌వ‌శాత్తు దేశానికి సంబంధించిన సున్నిత‌మైన అంశాన్ని రాజ‌కీయం చేశార‌ని విమ‌ర్శించారు. ఆర్మీలో వేల కోట్ల కుంభ‌కోణాల‌కు పాల్ప‌డిన ఆ వ్య‌క్తులే ఇప్పుడు ఆర్మీని నిర్వీర్యం చేస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ ఆరోపించారు.