మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడిగా ఉన్న దస్తగిరిని సీబీఐ కోర్టు సాక్షిగా పరిగణించింది. ఈ మేరకు దస్తగిరి దాఖలు చేసిన పిటీషన్‌ను అనుమతిస్తూ నిందితుల జాబితా నుంచి ఆయన పేరును తొలగిస్తూ సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
వైఎస్ వివేకా హత్య కేసులో దస్తగిరి 4వ నిందితుడిగా ఉన్నారు. తనను నిందితుల జాబితా నుంచి తొలగించి సాక్షిగా పరిగణనలోకి తీసుకోవాలంటూ షేక్ దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి డాక్టర్ టీ రఘురాం విచారణ చేపట్టి ఉత్తర్వులు జారీ చేశారు. 4వ నిందితుడిగా ఉన్న దస్తగిరిని సాక్షుల జాబితాలో 110వ సాక్షిగా పేర్కొన్నారన్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
సాక్షిగా ఉన్న వ్యక్తిని నిందితుల జాబితాలో ఉంచడం సరికాదని పేర్కొన్నారు. దస్తగిరి అప్రూవర్‌గా మారడంతో కోర్టు క్షమాభిక్ష ప్రసాదించిందని గుర్తు చేశారు. దీన్ని సవాలు చేస్తూ ఇతర నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు, సుప్రీం కోర్టులు సైతం కొట్టివేశాయని గుర్తు చేశారు. అందువల్ల నిందితుల జాబితా నుంచి తొలగించాలని కోరారు.
దస్తగిరి అప్రూవర్‌గా మారారని, అందువల్ల సాక్షిగా పరిగణనలోకి తీసుకున్నామని సీబీఐ తరపు న్యాయవాది కూడా కోర్టుకు తెలిపారు. ఆయనను నిందితుల జాబితా నుంచి తొలగించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. ఈ వాదనలతో సీబీఐ కోర్టు ఏకీభవిస్తూ దస్తగిరి పిటిషన్‌ను అనుమతించింది. దస్తగిరి పేరును నిందితుల జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారు.
దీనిపై ఇతర నిందితుల తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒకసారి కాగ్నిజెన్స్ తీసుకుంటూ జారీ చేసిన ఉత్తర్వులను ఇదే కోర్టు పునఃసమీక్షించజాలదని, అంతేకాకుండా నిందితుడికి ఇచ్చిన క్షమాభిక్షను సవాలు చేస్తూ హైకోర్టులో రెండు పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయని, అందువల్ల దస్తగిరి పిటిషన్‌ను కొట్టివేయాలని అన్నారు. ఈ వాదనలను సీబీఐ కోర్టు తోసిపుచ్చింది.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు