అమరావతికి రూ.15,000 కోట్ల ఆర్ధిక సాయంపై స్పష్టత

అమరావతికి రూ.15,000 కోట్ల ఆర్ధిక సాయంపై స్పష్టత

కేంద్ర బడ్జెట్​లో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రకటించిన రూ.15,000 కోట్ల ఆర్ధిక సాయంపై నెలకొన్న సందిగ్దతపై ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టతనిచ్చారు. ఈ రూ.15,000 కోట్ల రుణాన్ని ప్రపంచ బ్యాంకు నుంచి రుణంగా తీసుకుని, వివిధ ఏజెన్సీల ద్వారా అమరావతి నిర్మాణానికిి తోడ్పాటును అందిస్తామని ఆమె వెల్లడించారు. 

ఈ రుణాన్ని తిరిగి చెల్లించే విషయంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తామని, అయితే, ప్రస్తుతం ఏపీ ఈ రుణాన్ని చెల్లించే పరిస్థితిలో లేదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాను ఎలా చెల్లించాలన్నది వారితో చర్చించాల్సి ఉందని చెబుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వాటాను చెల్లించగలుగుతారా? లేదా? అన్న విషయంపై మాట్లాడాల్సి ఉందని ఆమె తెలిపారు. అప్పుడు వాళ్ల వాటాను కూడా కేంద్రమే గ్రాంట్‌గా ఇవ్వడమన్నది రాష్ట్రంతో మాట్లాడాక నిర్ణయిస్తామని చెప్పారు. ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ముందుకెళ్తామని పేర్కొన్నారు.

రాష్ట్ర విభజన తర్వాత గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో శుభవార్త చెప్పారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో అమరావతి అంశం ఉందని, ఏపీ రాజధానికి కేంద్రం సాయం చేయాలని చట్టంలో ఉందని, దాని ప్రకారం తప్పనిసరిగా ఏపీకి సాయం చేయాల్సి ఉందని ఆమె తెలిపారు. 

2024-25 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాజధాని అమరావతి అభివృద్ధికి రూ. 15,000 కోట్లు ప్రకటించారు. పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ సమావేశం అనంతరం మీడియా సమావేశంలో నిర్మలా సీతారామన్‌ పాల్లొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేశారు.  బడ్జెట్‌లో చెప్పిన రూ. 15,000 కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకుంటామని, అలాగే వివిధ అభివృద్ధి ఏజెన్సీల ద్వారా ఇవ్వనున్నట్లు నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.

ఈ సందర్భంగా రాజధాని అంశంపై కీలక నిర్మల సీతారామన్ వ్యాఖ్యలు చేశారు. ఏపీకి రాజధాని రాజధాని లేకుండానే పదేళ్లు గడిచాయని, దేశంలో ఒక రాష్ట్రం ఉందంటే తప్పనిసరిగా రాజధాని ఉండాలని, కానీ, రాజధాని లేకుండా ఉన్నది ఆంధ్రా మాత్రమేనని ఆమె విచారం వ్యక్తం చేశారు. దీనికి కారకులు ఎవరు అనే అంశం జోలికి తాను వెళ్లదలచుకోలేదని చెప్పారు. కానీ, రాజధాని నిర్మించేందుకు కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉందని ఆమె భరోసా ఇచ్చారు.

కేంద్రం అంగీకరించిన మేరకు అన్ని నిధులు అందించి తీరుతామని తెలిపారు. పోలవరం ఒక జాతీయ ప్రాజెక్ట్​ అని, అది కేంద్రం బాధ్యతని తెలిపారు. పోలవరానికి ఎంత ఖర్చయినా.. ఎలా తెచ్చినా కేంద్రానిదే బాధ్యతని అని ఆమె స్పష్టం చేశారు. పోలవరం పూర్తికి ఎంత అవసరమో, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ప్రాజెక్టు పూర్తికి మద్దతిస్తామని తెలిపారు.