ఇద్దరు సీనియర్ ఐపీఎస్ ల సస్పెన్షన్ కై రఘురామ పట్టు!

ఇద్దరు సీనియర్ ఐపీఎస్ ల సస్పెన్షన్ కై రఘురామ పట్టు!
గతంలో వైసిపి ప్రభుత్వ హయాంలో తనను అక్రమ కేసులో అరెస్ట్ చేసి, తనను పోలీస్ నిర్బంధంలో చిత్రహింసలకు గురిచేసి, తనను హత్యచేసేందుకు ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలని టిడిపి ఎమ్యెల్యే రఘురామకృష్ణంరాజు ప్రభుత్వంపై వత్తిడి పెంచుతున్నారు. 
 
ఈ విషయమై మూడేళ్ళుగా న్యాయపోరాటం చేస్తున్నా తనకు న్యాయం జరగకపోగా, ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఈ విషయమై ప్రభుత్వంలో ఎటువంటి కదలిక కనిపించక పోవడంతో ఆయన పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేశారు.
 
అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు మాజీ సీఐడీ అధిపతి పీవీ సునీల్ కుమార్, మాజీ నిఘావిభాగం అధిపతి పీఎస్ఆర్ ఆంజనేయులు, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతిపై ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై గుంటూరులోని నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 
 
అయితే, అంతటితో ఆగకుండా ఈ విషయమై రాష్ర ప్రభుత్వం తగు చర్య తీసుకోవాలని ఆయన వత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నవిధంగా తనపై హత్యాప్రయత్నం చేసినట్లు ఆరోపిస్తున్న ఇద్దరు పోలీస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
గతంలో విద్వేష వ్యాఖ్యల కేసులో తనను అరెస్టు చేసి కస్టడీలో హింసించిన అధికారులపై చర్యలకు ఆయన పట్టుబడుతున్నారు.
 
దీనిపై చర్యలు కోరుతూ గురువారం గుంటూరు ఎస్పీ కార్యాలయానికి రఘురామ వెళ్లారు.  గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎస్‌పి సతీష్‌కుమార్‌ని కలిసి తన కేసు పూర్వపరాలను వివరించారు.
 
అనంతరం మీడియాతో మాట్లాడుతూ గుంటూరు సీఐడీ కార్యాలయంలో తనను చంపేందుకు కుట్రపన్నారని, మీడియా వల్లనే తాను బతికిపోయినట్లు వెల్లడించారు. తన ఫిర్యాదు మేరకు మాజీ సీఐడీ డిజి సునీల్ కుమార్, విజయ్ పాల్, మాజీ సీఎం జగన్, జిజిహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి మీద కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు, పురోగతి తెలుసుకోవటానికి వచ్చానని చెప్పారు.

తన దగ్గర ఉన్న సమాచారం పోలీసు అధికారులకు ఇచ్చేందుకు వచ్చినట్లు రఘురామ తెలిపారు. తొలుత పోలీసు అధికారులను సస్పెండ్‌ చేసి విచారణ ప్రారంభించాలని కోరారు. 307 సెక్షన్‌ కేసులో డిజి స్థాయి అధికారులు, మాజీ సిఎం ఉండటం ఇప్పటి వరకూ జరగలేదని తెలిపారు. హత్యాయత్నం కేసు నమోదైనప్పుడు అధికారులను సస్పెండ్‌ చేయాలని ఆయన స్పష్టం చేశారు.  అప్పటి గుంటూరు కలెక్టర్‌ను కూడా ప్రశ్నించాలని, డాక్టర్‌ శ్రీకాంతే అందుబాటులో ఉండాలని కలెక్టర్‌ ఎందుకు రాశాడో తేల్చాల్సి ఉందని పేర్కొన్నారు.