డూప్లికేట్ తాళంతో తెరుచుకొని ర‌త్న భండారం తాళాలు!

డూప్లికేట్ తాళంతో తెరుచుకొని ర‌త్న భండారం తాళాలు!
పూరీ జ‌గ‌న్నాథ ఆల‌యంలోని ర‌త్న భండార్‌ను రెండు రోజుల తెరిచినప్పుడు ఆ  లోప‌లి గ‌దిని డూప్లికేట్ తాళంతో తెరిచేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. డూప్లికేట్ కీస్‌తో ఎందుకు ఆ గ‌ది తెరుచుకోలేదో తెలుసుకునేందుకు ద‌ర్యాప్తు చేప‌ట్ట‌నున్న‌ట్లు ఒడిశా ప్రభుత్వం వెల్లడించింది. 12వ శ‌తాబ్ధానికిచెందిన జ‌గ‌న్నాథ ఆల‌యం ర‌త్న భండార్‌ను జూలై 14వ తేదీన తెరిచిన విష‌యం తెలిసిందే. 
 
ర‌త్న భండార్‌ను 46 ఏళ్ల త‌ర్వాత తెరిచారు. దాంట్లో ఉన్న విలువైన బంగారు, వెండి ఆభ‌ర‌ణాల‌ను లెక్కించేందుకు ఆ ర‌త్న భండార్‌ను తెరిచారు. లోప‌లి గ‌దిలో ఉన్న మూడు తాళాల‌ను తెరిచేందుకు ప్ర‌త్యేక క‌మిటీ ప్ర‌య‌త్నించింది. అయితే పూరి జిల్లా అధికారి అర‌వింద ప‌దే వ‌ద్ద ఉన్న రెండు డూప్లికేట్ తాళంచెవిల‌తో ఆ ట్రెజ‌రీ తాళాలు తెరుచుకోలేదు.
 
బీజేడీ స‌ర్కారు స‌మ‌యంలో డూప్లికేట్ తాళం చెవిలు ఉన్న‌ట్లు అబ్దాలు ప్ర‌చారం జ‌రిగిన‌ట్లు న్యాయ‌శాఖ మంత్రి పృథ్వీరాజ్ హ‌రిచంద‌న్ తెలిపారు. దీనిపై ద‌ర్యాప్తు చేప‌ట్ట‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.  రాష్ట్ర ప్ర‌భుత్వ న్యాయ‌శాఖ ప‌రిధిలో జ‌గ‌న్నాథ ఆల‌యం ఉన్న‌ది. 2018, ఏప్రిల్ 4వ తేదీన ర‌త్న భండార్‌ను తెరిచేందుకు నాటి  ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించింది. 
 
కానీ తాళంచెవులు అందుబాటులో లేక‌పోవ‌డంతో ఆ ప్ర‌క్రియ విఫ‌ల‌మైంది. అయితే కొన్ని రోజుల‌కు డూప్లికేట్ తాళంచెవులు దొరికిన‌ట్లు చెప్పారు. ఒక‌వేళ ఎవ‌రైనా జ‌గ‌న్నాథుడి ఆభ‌ర‌ణాలు టచ్ చేసిన‌ట్లు తెలిస్తే, వాళ్లు క‌ఠిన ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని మంత్రి హెచ్చరించారు. కానీ అలాంటిది ఏమీ జ‌రిగి ఉండ‌ద‌ని అనుకుంటున్నాన‌ని, ఇన్వెంట‌రీ పూర్తి అయితే కానీ ఆ విష‌యాలు తెలియ‌వ‌ని మంత్రి హ‌రిచంద‌న్ పేర్కొన్నారు.

ర‌త్న భండార్ తాళాల గురించి స్ప‌ష్ట‌మైన వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌, బీజేడీలు తాజాగా డిమాండ్ చేశాయి. తాళాల‌ను ఎందుకు ప‌గ‌ల‌గొట్టార‌ని, ర‌త్న భండార్‌కు చెందిన ఒరిజిన‌ల్ కీస్ ఎక్కడ ఉన్నాయ‌ని, ఆ ఒరిజిన‌ల్ తాళం చెవుల గురించి తెలుసుకునేందుకు ప్ర‌జ‌లు ఆస‌క్తిగా ఉన్న‌ట్లు కాంగ్రెస్ ప్ర‌తినిధి బిశ్వ‌రంజ‌న్ మోహంతి తెలిపారు.

ఆదివారం ర‌త్న భండార్‌లో మూడు తాళాలు డూప్లికేట్ తాళంచెవుల‌తో ఓపెన్ కాక‌పోవ‌డంతో స్టాండ‌ర్డ్ ఆప‌రేటింగ్ ప్రోసీజ‌ర్ ప్ర‌కారం మెజిస్ట్రేట్ స‌మ‌క్షంలో లొప‌లి గ‌దికి చెందిన మూడు తాళాల‌ను ప‌గుల‌గొట్టారు. పూరీ జ‌గ‌న్నాథ ఆల‌య బేస్మింట్‌లో ర‌త్న భండార్ ఉన్న‌ది. రెండు గ‌దులుగా ఆ భండార్ ఉంది. బ‌య‌టి గ‌దిలో దేవుళ్ల‌కు రోజువారీగా వాడే ఆభ‌ర‌ణాల‌ను దాచిపెడుతారు. ఇక లోప‌లి గ‌దిలో దేవుళ్ల‌కు చెందిన బంగారు ఆభ‌ర‌ణాల‌ను దాచిపెడుతారు.