
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేతలు చేస్తున్న ఆరోపణలను తీహార్ జైలు అధికారులు తీవ్రంగా ఖండించారు. జైలు పరిపాలనా విలువలను దెబ్బ తీయడానికే ఆప్ నేతలు ఇటువంటి అసత్య ఆరోపణలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు స్పష్టం చేశారు.
అరవింద్ కేజ్రీవాల్ 8.5 కిలోల బరువు తగ్గారని, ఆయన చక్కెర స్థాయిలు ఐదుసార్లు 50 కంటే తక్కువకు పడిపోయాయని ఆప్ నేతలు తెలిపారు. తిహార్ జైల్లోనే ఆయనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై తీహార్ జైలు యంత్రాంగం సోమవారం స్పందించింది. ప్రస్తుతం కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితి అంతా బాగానే ఉందని తెలిపారు.
ఆయన తగ్గింది 8.5 కిలోలు కాదని, కేవలం 2కేజీలు మాత్రమే తగ్గారని చెబుతూ ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఏప్రిల్ 1న కేజ్రీవాల్‌ను తీహార్ జైలుకు తీసుకువచ్చినప్పుడు ఆయన 65 కిలోలు బరువు ఉన్నారు. ఆ తర్వాత ఎన్నికల నేపథ్యంలో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరుచేసే సమయానికి 65 కిలోలకు పెరిగారని పేర్కొన్నారు.
అనంతరం క్రేజీవాల్ జైల్లో లొంగిపోయిన సమయంలో ఆయన బరువు 63.5 కిలోలుగా నమోదైందని, ప్రస్తుతం ఆయన 61.5 కిలోల బరువు ఉన్నారని జైలు అధికారులు వెల్లడించారు. కేజ్రీవాల్ తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకోవడం వల్ల బరువు తగ్గినట్లు వైద్యులు చెప్పినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారన్నారని, మెడికల్ బోర్డు సలహా మేరకే ఆహారం, చికిత్స అందిస్తున్నట్లుగా వెల్లడించారు.
కేజ్రీవాల్ ఆరోగ్యం విషయంలో ఆప్ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని జైలు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ బరువు తగ్గారని, చక్కెర స్థాయిలు కూడా పడిపోయాయని, జైలులో ఉన్నందున సరైన వైద్య సహాయం పొందలేకపోతున్నారని ఢిల్లీ మంత్రి అతిశీ, ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ ఆదివారం మీడియాతో తెలిపారు. కేజ్రీవాల్ స్ట్రోక్‌కు గురైనా, మెదడు దెబ్బతిన్నట్లయితే ఎవరు బాధ్యత వహిస్తారు? అంటూ ప్రశ్నించారు.
మరోవైపు, కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చేలా చేయడానికే ఆరోపణలు చేస్తున్నారనంటూ బీజేపీ విమర్శించింది. ఇటువంటి నిరాధార ఆరోపణలతో ఆప్ నేతలు కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడింది.
More Stories
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు
ఇది ప్రతి భారతీయుడి విజయం