ట్రంప్ పై హత్యాయత్నంతో `రాజకీయ అంతర్యుద్ధం’ వైపు  అమెరికా

ట్రంప్ పై హత్యాయత్నంతో `రాజకీయ అంతర్యుద్ధం’ వైపు  అమెరికా
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పెన్సిల్వేనియాలోని బట్లర్‌ పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతుండగా ఓ దుండగుడు కాల్పులు జరపడంతో జరిగిన హత్యాయత్నం నుండి తృటిలో తప్పించుకున్నారు. ఆయన ఈ ప్రయత్నంలో హత్యకు గురయ్యి ఉంటె నేడు అమెరికా తీవ్రమైన అల్లకల్లోలంలో చిక్కుకొని ఉండెడిది. గత కొంత కాలంగా అమెరికాలో పెచ్చుపెరుగుతున్న హింసాయుత రాజకీయ సంస్కృతికి ఈ ఘటన అద్దం పడుతుంది.
 
ఈ ఘటన అమెరికాను రాజకీయ అంతర్యుద్ధంకు ఒక అంగుళం దూరంకు నెట్టివేసిందని యూనివర్శిటీ ఆఫ్ మసాచుసెట్స్ అధ్యాపకుడు ఆరీ పేర్లిగెర్  భావిస్తున్నారు.  నిజంగానే, డొనాల్డ్ ట్రంప్‌కు ప్రాణాపాయమైన గాయాలు తగిలి ఉంటే, రాబోయే రెండు నెలల్లో చెలరేగగల దానితో పోల్చితే ఇప్పటివరకు మనం చూసిన హింస స్థాయి ఏమీ లేన్నట్లే భావిస్తున్నట్లు చెప్పడం గమనిస్తే అమెరికా ఓ భారీ ఉపద్రవం నుండి బయటపడుతున్నట్లు స్పష్టం అవుతుంది.
 
అమెరికా ప్రజాస్వామ్యంలో పరస్పరం సమాలోచనలు ద్వారా పరిష్కారాలు అన్వేషించే విధానాలకు ముగింపును ఈ హత్యాయత్నం ప్రతిబింబిస్తుందని జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీకి చెందిన అమితాబ్ మట్ టూ భావిస్తున్నారు.  అమెరికాలో ఇటువంటి హత్యారాజకీయాలు కొత్తమీ కాదు. గతంలో నలుగురు అధ్యక్షులు ఇటువంటి ఘటనలు ఎదుర్కొన్నారు. అబ్రహం లింకన్, జాన్ ఎఫ్ కెన్నెడీ హత్యకు గురికాగా, రూజ్వెల్ట్, రెగన్ లపై హత్యా ప్రయత్నాలు జరిగాయి.
 
అమెరికాలో చాలా సంవత్సరాలుగా మనం చూడని కోపం, చిరాకు, పగ, శత్రుత్వం కొత్త స్థాయిని ఆవిష్కరిస్తున్నట్లు మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గొప్ప ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకొనే అమెరికాలో కొంత కాలంగా హింసాయుత శక్తులకు, ప్రపంచంలోని వివిధ దేశాలలో నిషిద్ధ తీవ్రవాద గ్రూప్ లకు స్థావరంగా మారుతుంది. వివిధ దేశాలలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను అమెరికా కేంద్రంగా మలచుకొంటున్నారు.
 
ఈ హత్యాయత్నం కారణంగా ఇక ఎన్నికలు లాంఛనప్రాయమే అని, డోనాల్డ్ ట్రంప్ నేరుగా వైట్ హౌస్ కు మరోసారి చేరుకునేందుకు మార్గాన్ని సులభతరం కావించిందని ఆయన మద్దతుదారులు ఇప్పుడు సంతోషంలో మునిగితేలుతూ ఉండవచ్చు.  అయితే, నేరస్థులు హత్యలను తమ రాజకీయ లక్ష్యాలను చాలా త్వరగా, చాలా ప్రభావవంతమైన మార్గంలో సాధించడానికి అనుమతించే సాధనంగా చూడగలగడం నేడు ఆ దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభంగా చెప్పవచ్చు.
 
చాలామంది ట్రంప్ ను ఓ విలక్షణమైన వ్యక్తిగా చూస్తున్నారు. సాంప్రదాయ రాజకీయాలకు భిన్నమైన వ్యక్తిగా చూస్తున్నారు. ఆయనను అడ్డు తొలగించుకోవడం ద్వారా రాజకీయాలలో తమకు అడ్డే ఉండబోదనే ఆలోచనలు నేడు అమెరికాను ఆవహించడం ఆందోళన కలిగిస్తుంది.
 
ఈ హత్యాయత్నంను ఎఫ్ బి ఐ, సీక్రెట్ సర్వీస్, న్యాయస్థానాలకు వదిలివేసి, పైకి కనిపించే నిందితులను లక్ష్యంగా తీసుకుంటే పరిస్థితులు మారవు. అమెరికా ప్రజలు లోతుగా ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాజకీయాలు, హింసకు అసలు పోసగదని గ్రహించాలి. ఎక్కడైతే రాజకీయాలు నిలిచిపోతాయో అక్కడే హింస బయలుదేరుతుంది.
రాజకీయ హింస, అంతర్గత  ఉగ్రవాదం అమెరికాలో అభద్రతకు ఏకైక అతిపెద్ద మూలం. జనవరి 6, 2021న అమెరికా కాపిటల్‌పై దాడి చేయడం ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత భయంకరమైన రాజకీయ హింసాత్మక చర్యల్లో ఒకటి. అప్పటి అధ్యక్షుడు ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంలోకి దూసుకుపోయి, ఎలక్టోరల్ కాలేజీ ఫలితాల ధృవీకరణకు అంతరాయం కలిగించారు.
 
అమెరికాను ప్రజాస్వామ్యంకు  గుండెగా అనేకమంది భావిస్తున్న సమయంలో ఈ అపూర్వమైన దాడి రెండు రాజకీయ పార్టీల మధ్య విశ్వాస లోపాన్ని మాత్రమే కాకుండా రాజకీయ ప్రయోజనాలను సాధించడానికి రాజకీయ శ్రేణులు హింసను సాధనంగా ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నారని కూడా బహిర్గతం చేసింది. ఆ సంఘటనలు ఉన్నప్పటికీ ట్రంప్ రాజకీయంగా ఎటువంటి జవాబుదారీతనం లేకుండా, తిరిగి అధ్యక్ష ఎన్నికల విజయానికి దగ్గరలో ఉన్నారని భావిస్తూ ఉండటం అమెరికా ప్రజాస్వామ్య పతనాన్ని మాత్రమే వెల్లడి చేస్తుంది.
 
వివిధ పార్టీలు, వివిధ ఉద్యమాలు కొన్ని సమస్యలపై కలిసి పనిచేయడానికి ఇష్టపడకపోతే ప్రజాస్వామ్యం పనిచేయదు. రాజకీయ ప్రత్యర్దులను శత్రుమూకలుగా పరిగణించడం, కనీసం కలిసి చర్చించే అవకాశాలు కూడా లేకుండా చేయడం ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకు విరుద్ధం. కేవలం క్రమం తప్పకుండా ఎన్నికలు జరపడమే ప్రజాస్వామ్యం కాబోదు. విభిన్నమైన ఆలోచనలు గలవారు సమిష్టిగా కలిసి పనిచేయలేనప్పుడు ప్రజాస్వామ్యానికి అర్ధం ఉండదు.
 
నేడు ప్రపంచంలో పలు ప్రజాస్వామ్య దేశాలలో అసహనం ప్రబలుతుంది. భిన్నాభిప్రాయాలను, విమర్శలను సహింపలేని దుస్థితి ఏర్పడుతుంది. సమిష్టిగా పనిచేయలేని వాతావరణం నెలకొంటుంది. నేడు అమెరికాలో సహితం కొంతకాలంగా అటువంటి వాతావరణం కనిపిస్తున్నది. గత అధ్యక్ష ఎన్నికలలో ఓటమి తర్వాత నూతన అధ్యక్షుడికి సంప్రాదయపూర్వకమైన స్వాగతం చెప్పలేక పోవడం ద్వారా ఇటువంటి అసహన రాజకీయాలకు ట్రంప్ మార్గం ఏర్పర్చారని చెప్పవచ్చు.
 
ఇటువంటి ధోరణుల కారణంగా అమెరికన్ రాజకీయ వ్యవస్థ పనిచేయలేని పరిస్థితులలో చిక్కుకున్నట్లు పలువురు భావిస్తున్నారు. ఎదుటివారితో సహకరించడానికి ఆసక్తి ఉన్న రాజకీయ నాయకులు, విధాన రూపకర్తలను మేము బలవంతంగా బయటకు పంపుతున్నామని  ఆరీ పెర్లిగేర్ ఆందోళన వ్యక్తం చేశారు.
 
మరోవంక, తమ రాజకీయ ప్రత్యర్థులను చట్టవ్యతిరేకంగా పనిచేస్తున్నవారుగా భావిస్తూ ఉండడంతో రాజకీయ అసమ్మతిని తమపై పోరాటంగా భావిస్తున్నారు. దానితో దేశం ఎదుర్కొంటున్న సేవాళ్లను పరిష్కరించేందుకు కలిసి పనిచేసే అవకాశం లేకుండా చేస్తున్నారు.
 
ఎదుటి పక్షం గెలిస్తే ప్రజాస్వామ్యానికి అంతం అయినట్లే అని, తాము ఎన్నికల్లో ఓడిపోతే ప్రపంచం అంతం మునిగిపోయినట్లు అని ఇరువర్గాలు పదే పదే ప్రజలను దూషిస్తూంటే, చివరికి ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని హింసకు పాల్పడటంతో ఆశ్చర్యం ఉండబోదని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రజాస్వామ్య దేశాలు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని ట్రంప్ పై జరిగిన హత్యాయత్నం ఓ సంకేతం మాత్రమే.