
బిజెపి నేతృత్వంలోని మహాయుతి కూటమి మహారాష్ట్రాలో జరిగిన ఎమ్యెల్సీ ఎన్నికలలో తన ఆధిపత్యం చాటుకుంది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)లతో కలిసి 11 స్థానాలకు గాను 9 స్థానాలను కైవసం చేసుకుంది.
ఎన్నికల్లో మొత్తం ఐదుగురు బిజెపి అభ్యర్థులు, ఇద్దరు సేన, ఇద్దరు ఎన్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. మొత్తంమీద, ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహాయుతి, మహా వికాస్ కూటమిల మధ్య ప్రధాన పోటీలో మొత్తం 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రతిపక్ష కూటమిలో కేవలం 2 స్థానాలను కాంగ్రెస్ గెల్చుకొని పరిమితం కావాల్సి వచ్చింది.
రాష్ట్రంలోని 48 స్థానాలకు గాను 31 స్థానాలను గెలుచుకొని ఇటీవలి లోక్‌సభ ఎన్నికలలో సాధించిన విజయంపై ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ప్రతిపక్ష ఎంవీఏకు ఈ ఫలితాలతో ఎదురుదెబ్బ తగిలింది. అక్టోబర్- నవంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపి, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీలతో టచ్‌లో ఉన్నారనే పుకార్లకు కూడా ఫలితాలు ప్రస్తుతానికి స్వస్తి పలికాయి.
మరోవంక, కాంగ్రెస్ వైపు నుండి క్రాస్ ఓటింగ్ జరిగినట్లు వస్తున్న వార్తలు ప్రతిపక్ష కూటమికి ఆందోళన కలిగిస్తున్నది. ప్రాథమిక అంచనా ప్రకారం, ప్రతిపక్ష ప్రతిపక్ష కూటమి నుండి ఏడుగురు ఎమ్మెల్యేలు అధికార పక్షానికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేశారు.
బిజెపికి చెందిన పంకజా ముండే, యోగేష్ తిలేకర్, పరిణయ్ ఫుకే, అమిత్ గోర్ఖే, సదాభౌ ఖోట్, అజిత్ పవార్-ఎన్సీపీ నుండి రాజేష్ విటేకర్, శివజ్రావ్ గార్జే, ఏకనాథ్ షిండే-శివసేనకు చెందిన కృపాల్ తుమానే, భవనా గవాలీ ఎన్నికల్లో విజయం సాధించారు. మహాయుతి కూటమికి చెందిన మొత్తం తొమ్మిది మంది విజయం సాధించారు.
మహారాష్ట్ర శాసన మండలి ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 11 స్థానాల్లో తొమ్మిది స్థానాలను గెలుచుకోవడంతో మహాయుతి కూటమి నేతలు విజయ సంకేతం చూపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ మాట్లాడుతూ ఐదుగురు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తమకు మద్దతిచ్చారని పేర్కొంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
More Stories
బిహార్ ఎన్నికల్లో వికాసానికి, వినాశనానికి మధ్య పోరు
ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త చిట్నిస్ కన్నుమూత
ఏఐతో డీప్‌ఫేక్, కృత్రిమ కంటెంట్ లపై కేంద్రం కొరడా