జగన్‌, ఐపీఎస్‌లు పీవీ సునీల్, పిఎస్సార్‌లపై హత్యాయత్నం కేసు

జగన్‌, ఐపీఎస్‌లు పీవీ సునీల్, పిఎస్సార్‌లపై హత్యాయత్నం కేసు
వైసీపీ మాజీ ఎంపీ, ప్రస్తుత టిడిపి ఎమ్యెల్యే కె. రఘురామకృష్ణంరాజును గత వైసిపి పాలనలో నిర్బంధంలో చిత్రహింసలకు  గురిచేశారనే ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డితో పాటు మాజీ సిఐడి చీఫ్‌ పీవీ సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పిఎస్సార్‌ ఆంజనేయులు, డిఎస్పీ విజయ్‌పాల్‌లపై నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.

మాజీ సిఎం జగన్‌ బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంతో కక్ష కట్టిన జగన్ తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయించారని రఘురామ ఆరోపించారు. సిఆర్‌పిఎఫ్‌ భద్రతలో ఉండగానే వారిని బలవంతంగా బయటకు పంపి హైదరాబాద్‌ నుంచి తనను గుంటూరు తీసుకువచ్చి తీవ్రంగా హింసించారని ఆరోపించారు.  

తనకు బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పినప్పటికీ, తన ఛాతీపై కూర్చొని తనను చంపడానికి ప్రయత్నం చేశారని, ఫోన్ పాస్ వర్డ్ చెప్పాలని కొట్టారని ఆరోపించారు. తనకు చికిత్స చేసిన జీజీహెచ్ డాక్టర్ ప్రభావతిపై కూడా ఆయన ఫిర్యాదులో చేశారు. పోలీసుల ఒత్తిడితో తప్పుడు మెడికల్ రిపోర్టులు ఇచ్చారని తెలిపారు. జగన్​ను విమర్శిస్తే చంపుతామని సునీల్ కుమార్ బెదిరించారని తెలిపారు.

తనను హింసిస్తున్న దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించి ఎవరికో పంపారని, వాటిని తాడేపల్లిలో ఉన్న వాళ్లు వీక్షించారని ఆరోపించారు.జగన్‌ ఆదేశాలతోనే తనను అరెస్ట్ చేశారని రఘురామ పలు సందర్భాల్లో ఆరోపించారు.

నిర్బంధంలో తనను చిత్రహింసలకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటే దాదాపు మూడేళ్లుగా రఘురామ న్యాయ పోరాటం చేస్తున్నారు. ఏపీలో ప్రభుత్వం మారిన వెంటనే పోలీసులపై చర్యలు తీసుకోవాలని, కస్టడీలో తనను హింసించిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనపై విచారణ జరపాలని పోలీసులకు జూన్‌ 10న ఫిర్యాదు చేశారు.

గుంటూరులోని నగరపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.  2021 మే 14న తనపై హత్యాయత్నం చేశారని, రబ్బర్‌ బెల్ట్‌, లాఠీలతో కొట్టారని రఘురామ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో మాజీ సీఎం జగన్​ను ఎ3గా పోలీసులు పేర్కొన్నారు. ఎ1గా సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్, ఎ2గా మాజీ ఇంటెలిజెన్స్​ చీఫ్​ సీతారామాంజనేయులు, ఎ4గా విజయపాల్, ఎ5గా డాక్టర్ ప్రభావతిలను చేర్చారు.