
సోషల్ మీడియాలో తండ్రీకూతురు బంధంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్, నటుడు ప్రణీత్ హనుమంతును తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. బెంగళూరు కోర్టులో ప్రణీత్‌ను హాజరు పరిచి ట్రాన్సిట్ వారింటి మీద హైదరాబాద్‌కు తీసుకురానున్నారు.
ఇప్పటికే హనుమంతుతోపాటు మరో ముగ్గురిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఓ వీడియో ఆధారంగా సోషల్ మీడియాలో తండ్రీకూతురుపై చర్చపెట్టి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వారిపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా ఒకరిని అరెస్టు చేశారు.
కాగా, ఓ తండ్రి తన కూతురితో కలిసి సరదాగా ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అయితే, ఆ వీడియోపై డార్క్ కామెడీ పేరుతో యూట్యూబర్ ప్రణీత్ మరికొందరితో కలిసి అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేశారు. తండ్రీ కూతుళ్ల బంధాన్ని చెడు కోణంలో చూపిస్తూ వారి గురించి అత్యంత హేయంగా మాట్లాడారు.
ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. మెుదట ఆ వీడియో చూసిన సినీ హిరో సాయిధరమ్ తేజ్ వారిపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులకు ఎక్స్(ట్విటర్)లో ట్యాగ్ చేశారు. చిన్నారులపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
సోషల్ మీడియా ప్రమాదకరంగా మారిందని, పిల్లల ఫొటోలు/వీడియోలు పోస్ట్ చేయడంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సాయి తేజ్ తల్లిదండ్రులకు సూచించారు. ‘కట్టడి చేయలేనంతగా సోషల్ మీడియాలు క్రూరంగా, భయానకంగా మారిపోయాయి. కొన్ని మానవ మృగాల నుంచి పిల్లలను రక్షించుకోవాలని పేరెంట్స్ అందరికీ నా విజ్ఞప్తి. మీ పిల్లల ఫొటోలు, వీడియోలను నెట్టింట పోస్ట్ చేసేటప్పుడు కాస్త ఆలోచించండి. ఎందుకంటే, సోషల్ మీడియా మృగాలకు తల్లిదండ్రుల బాధ అర్థం కాదు’ అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు సాయిత్ తేజ్.
చిన్నారుల భద్రతపై ఆలోచించాల్సిన అవసరముందని సాయితేజ్ మరో పోస్టులో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను అభ్యర్థించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఎక్స్(ట్విట్టర్) ఖాతాలను ట్యాగ్ చేశారు.
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. పిల్లల భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. సమస్యను తమ దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు తెలిపిన వారు నిందితులపై కఠిన ర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే నిందితుడు ప్రణీత్ హనుమంతును పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం.
అలాగే మంచు మనోజ్, మంచు లక్ష్మి సైతం ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యసమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు ఉన్నాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
More Stories
స్వదేశీ, స్వావలంబన దిశగా స్వదేశీ జాగరణ్ మంచ్
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!