రూ 500, రూ 200 నోట్లను రద్దు చేయాలి

రూ 500, రూ 200 నోట్లను రద్దు చేయాలి
అవినీతిని, నల్లధనాన్ని అరికట్టడం కోసం రూ 500, రూ 200 నోట్లను కూడా రద్దు చేసి డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. గతంలో రూ 1,000, రూ 500 నోట్లను రద్దు చేయాలని సూచించిన ఆయన రూ 2,000 నోట్లను రద్దు చేయాలని కూడా కోరారు. మంగళవారం జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన ఈ ప్రతిపాదనను వారి ముందు ఉంచారు.

కొందరు గత ఐదేళ్లలో కొట్టేసిన సొమ్ముతో ఇప్పుడు వ్యవస్థలను కొనుగోలు చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కొందరు రాజకీయం ముసుగులో ప్రజాధనాన్ని లూటీ చేసి ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ ముసుగులో బెదిరిస్తే భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

నేరస్థులు, అవినీతి పరులు తప్పించుకోలేరన్నారు. గత ప్రభుత్వ పాలనలో అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారని చెబుతూ నేరస్థులు, అవినీతిపరులు చట్టం నుండి తప్పించుకోలేరని ఆయన హెచ్చరించారు. అవినీతి, అక్రమాలపై చట్టప్రకారం వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో అవినీతి భూతాన్ని భూస్థాపితం చేస్తామని స్పష్టం చేశారు.
 
గత ప్రభుత్వం ఆర్ధిక వ్యవస్థను ధ్వంసం చేసి, అప్పులు మిగిల్చిందని, అనేక బిల్లులు చెల్లించాల్సి ఉందని చెప్పారు. అయినా ప్రజలకు ఇచ్చిన మాటప్రకారం పెంచిన పెన్షన్లను అందించామని, ఉచితంగా ఇసుక సరఫరాను ప్రారంభించామని తెలియపరు.

పరిపాలన పారదర్శకంగా లేని పక్షంలో రాష్ట్రంలో పెట్టుబడులకు ఎవ్వరూ ముందుకు రారని చెప్పారు. గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో రాష్ట్రానికి పెట్టుబడులు కూడా రాకుండా పోయాయని పేర్కొంటూ  గత ప్రభుత్వ నిర్వాకంతో ఇప్పటికే కొన్ని కంపెనీలు, సంస్థలు వెనక్కు వెళ్లాయని, ఎవరూ పెట్టుబడులకు ముందుకు రాలేదని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇకపై ఎవరైనా అక్రమాలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. అప్పుల వాళ్లు రోజూ తిరుగుతున్నారని, పెండింగ్‌లో ఉన్న కొన్ని బిల్లులు క్లియర్ చేయాల్సి ఉందని చెప్పారు.

ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలని చెబుతూ ప్రజలు గెలిచి తమను గొప్ప స్థానంలో నిలబెట్టారని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వ శాఖల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని, ఈ కారణంగానే శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.  సమర్థమైన పాలన వల్లే పేదలకు మెరుగైన ప్రయోజనాలు అందుతాయని స్పష్టం చేశారు. బాధ్యత లేని పరిపాలన వల్ల అనేక కష్టాలు ఎదురవుతాయని చెప్పారు.