ఫ్రాన్స్ లో వామపక్ష కూటమి జయకేతనం

ఫ్రాన్స్ లో వామపక్ష కూటమి జయకేతనం
ఫ్రాన్స్‌ పార్లమెంటు ఎన్నికల్లో వామపక్ష, ప్రగతిశీల కూటమి న్యూ పాపులర్‌ ఫ్రంట్‌ అత్యధిక సీట్లు గెలుచుకునే దిశగా పయనిస్తోంది. ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి మెరైన్‌ లీపెన్‌ నేతృత్వంలోని నియో  పార్టీ నేషనల్‌ ర్యాలీ (ఆర్‌ఎన్‌) మూడో స్థానంలోకి దిగజారింది. మాక్రాన్‌ నేతృత్వంలోని రినైజాన్స్‌ పార్టీ అనూహ్యంగా రెండో స్థానంలోకి వచ్చింది. 
 
577 సీట్లు ఉన్న పార్లమెంటులో సాధారణ మెజార్టీకి అవసరమైన 289 స్థానాలు ఏ పార్టీకి లేదా కూటమికి దక్కే సూచనలు కనబడడం లేదు. లీపెన్‌ పార్టీ కి  ప్రత్యామ్నాయంగా సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ వంటి అంశాలతో ముందుకొచ్చిన న్యూ పాపులర్‌ ఫ్రంట్‌ (ఎన్‌పిఎఫ్‌)ను ప్రజలు ఆదరించారు. 
 
కమ్యూనిస్టు పార్టీ, సోషలిస్టు పార్టీ, గ్రీన్స్‌, ఫ్రాన్స్‌ అన్‌బౌండ్‌ వంటి వామపక్ష ప్రగతిశీల శక్తులతో కూడిన పాపులర్‌ ఫ్రంట్‌ మొదటి రౌండ్‌లో 28.1 శాతం ఓట్లతో రెండవ స్థానంలో నిలిచింది. రెండో రౌండ్‌లో నియో పార్టీని వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచింది. ఫ్రాన్స్‌ టెలివిజన్‌, రేడియో ఫ్రాన్స్‌, ఫ్రాన్స్‌ 24 వెల్లడించిిన ప్రాథమిక అంచనా ప్రకారం ఎన్‌పిఎఫ్‌కు 172 నుంచి 192 సీట్లు దాకా వచ్చే అవకాశముంది. 
 
మాక్రాన్‌ పార్టీకి 150నుంచి 170 దాకా వచ్చే అవకాశముంది. లీపెన్‌ పార్టీకి 132 నుండి 152 వరకు మాత్రమే సీట్లు వస్తాయని తెలుస్తోంది. మొదటి రౌండర్‌లో నేషనల్‌ ర్యాలీ కన్నా 5 శాతం ఓట్ల తేడాతో రెండవ స్థానంలో నిలిచిన పాపులర్‌ ఫ్రంట్‌ రెండవ రౌండ్‌లో తన ఓటింగ్‌ బలాన్ని బాగా పెంచుకుంది. అధ్యక్షుడు ఇమానియెల్‌ మాక్రాన్‌ నాయకత్వంలోని రినైజాన్స్‌ పార్టీ ఊహించని విధంగా రెండో రౌండ్‌లో పుంజుకుంది. 
 
577 సీట్లు ఉన్న ఫ్రాన్స్‌ పార్లమెంటులో మొదటి రౌండ్‌లో 76 మంది ఎన్నిక కాగా, మిగతా 506 స్థానాలకు రెండో రౌండ్‌లో ఎన్నికలు జరిగాయి. పార్లమెంటులో సాధారణ మెజార్టీ సాధించాలంటే కనీసం 289 సీట్లు రావాలి. పోలింగ్‌ సరళి చూస్తే మొదటి రౌండ్‌ కన్నా రెండో రౌండ్‌లో కొంచెం ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 వరకు పోలింగ్‌ జరిగింది. మధ్యాహ్నానికి 26.68శాతం, సాయంత్రం 5 గంటలకు 59.71 శాతం ఓట్లు పోలైనట్లు ఆంతరంగిక శాఖ తెలిపింది.