టిఎంసి ఎంపీ మహువా మోయిత్రాపై ఎన్ సీడబ్ల్యూ కేసు

టిఎంసి ఎంపీ మహువా మోయిత్రాపై ఎన్ సీడబ్ల్యూ కేసు
పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రాపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) చీఫ్ రేఖా శర్మను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ ద్వారా అవమానించినందుకు ఈ మేరకు చర్యలు చేపట్టారు. 
రేఖాశర్మపై సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో మహువ మొయిత్రా ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని ఎన్సీడబ్ల్యూ చీఫ్ రేఖా శర్మ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా  ఓ వ్యక్తి ఆమెకు గొడుగు పట్టారు. రేఖా శర్మ తన సొంత గొడుకు ఎందుకు మోయలేకపోయారంటూ ఒక నెటిజన్ ప్రశ్నించడంతో.. ”ఆమె (రేఖాశర్మ) తన బాస్ పైజమాను పట్టుకోవడంలో బిజీగా ఉన్నారు” అంటూ మొయిత్రా వ్యాఖ్యానించారు.
ఆ తర్వాత ఆ ట్వీట్‌ను ఆమె తొలగించారు. అయితే మొయిత్రా వ్యాఖ్యలపై ఎన్‌సీడబ్ల్యూ కన్నెర్ర చేసింది. మొయిత్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహువా మోయిత్రా పోస్ట్‌పై ఎన్సీడబ్ల్యూ చీఫ్ రేఖా శర్మ స్పందించారు. ఆ పోస్ట్‌ ద్వారా తనను అవమానించినట్లు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 79 కింద మహువా మోయిత్రాపై ఆదివారం కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా ఎక్స్‌ నుంచి ఆ పోస్ట్‌ వివరాలు సేకరిస్తామని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌ విభాగం పేర్కొంది. దీనిపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది.
పోలీస్ కేసు పట్ల మొయిత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన వాఖ్యలపై మహిళా కమిషన్ ఏకపక్షంగా జారీచేసిన సుమోటో ఉత్తరువులపై వెంటనే ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. తాను ప్రస్తుతం నాడియాలో ఉన్నానని చెబుతూ వచ్చే మూడు రోజులలో తన అవసరముంటే వెంటనే తనను అరెస్ట్ చేయమని ఆమె సూచించారు. అదే విధంగా రేఖా శర్మ చేసిన పలు వాఖ్యల స్క్రీన్ షాట్ లను జతచేస్తూ ఆమెపై కూడా ఢిల్లీ పోలీసులు చర్య తెసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.