14 ఏళ్ల త‌ర్వాత అసాంజే ఫ్రీకు స్వేచ్ఛ

14 ఏళ్ల త‌ర్వాత అసాంజే ఫ్రీకు స్వేచ్ఛ
 
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే లండన్‌ బెల్‌మార్ష్‌ జైలు నుంచి సోమవారం విడుదలయ్యారు. అమెరికా గూఢచర్య చట్టాన్ని ఉల్లంఘించిన ఆయన తన నేరాన్ని అంగీకరించినట్టు సమాచారం. ఈ మేరకు అమెరికా ప్రభుత్వంతో ఒప్పందంలో భాగంగానే అసాంజే బెయిల్‌‌పై విడుదలైనట్టు తెలుస్తోంది. దాదాపు ఐదేళ్ల పాటు జైలు జీవితం గడిపిన ఆయన ఎట్టకేలకు స్వేచ్ఛా వాయువులను పీల్చుకున్నారు.
తన సొంత దేశం ఆస్ట్రేలియా వెళ్లేందుకు అనుమతి లభించినట్లు తెలుస్తోంది. అటు, అసాంజే జైలు నుంచి విడుదలైన విషయాన్ని వికీలీక్స్‌ సంస్థ సైతం ధ్రువీకరించింది. ఈ మేరకు ఓ సుదీర్ఘమైన పోస్టును ఆ సంస్థ తన అధికారిక ఎక్స్‌ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్‌ చేసింది.

మిలిట‌రీ ర‌హ‌స్య ప‌త్రాల‌ను రిలీజ్ చేసిన కేసులో వికీలీక్స్ ఫౌండ‌ర్ జూలియ‌న్ అసాంజే అమెరికాతో ముంద‌స్తు ఒప్పందం కుదుర్చుకున్నారు. దానిలో భాగంగా ఇవాళ మారియానా దీవుల్లో ఉన్న కోర్టుకు ఆయ‌న హాజ‌ర‌య్యారు. కోర్టు విచార‌ణ అనంత‌రం.. అసాంజే విముక్తి అయ్యారు. ఆయ‌న స్వేచ్ఛ‌గా కోర్టు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. 

ఎన్నో ఏళ్లుగా సాగుతున్న న్యాయ‌పోరాటం ముగిసింది. ఇన్నాళ్లూ బ్రిట‌న్ జైలులో ఉన్న అసాంజే మంగళవారమే అమెరికా కోర్టుకు వెళ్లారు. అయితే అమెరికా కోర్టు అసాంజేకు తాజాగా ఎటువంటి శిక్ష‌ను విధించ‌లేదు. దీంతో ఆయ‌న త‌న స్వంత దేశం ఆస్ట్రేలియాకు ప‌య‌నం అవుతున్నారు. మిలిట‌రీ స‌మాచారాన్ని లీక్ చేసిన కేసులో అసాంజే తీవ్రమైన జైలు శిక్ష‌ను లండ‌న్‌లో అనుభ‌వించారు.

దేశ‌ద్రోహం కేసులో అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్న త‌ర్వాత అసాంజే కోర్టును ఆశ్ర‌యించారు. బ్రిట‌న్ జైలులో అసాంజే అయిదేళ్లు శిక్ష‌ను అనుభ‌వించారు. అంత‌కుముందు ఆయ‌న ఈక్వ‌డార్ ఎంబ‌సీలో ఏడేళ్లు గ‌డిపారు. అమెరిక కోర్టులో దాఖలైన అఫిడివిట్ సారాంశం సోమవారం రాత్రి బయటకు వచ్చింది.

‘బ్రిటన్‌లో కస్టడీలో ఉన్న అసాంజే.. అమెరికా గూఢచర్య చట్టాల ఉల్లంఘనకు పాల్పడినట్లు అంగీకరించాడు.. ఆయనపై నమోదైన 18 అభియోగాలను ఒక్క కేసుగానే విచారించనున్నాం.. బుధవారం ఉదయం సైపన్‌ న్యాయస్థానం ఎదుట విచారణకు అసాంజే హాజరవుతారు.. ఆయనకు ఐదేళ్లకుపైగా శిక్ష విధించనుంది.. ఇప్పటికే యూకేలో శిక్ష అనుభవించడంతో దానిని మినహాయిస్తారు.. ఆపై తన సొంత దేశం ఆస్ట్రేలియా వెళ్లేందుకు అనుమతిస్తారు’ అని అందులో పేర్కొన్నారు.

 అసాంజే విడుదల ప‌ట్ల ఆయ‌న భార్య స్టెల్లా సంతోషం వ్య‌క్తం చేశారు. ఆస్ట్రేలియాలోని క్యాన్‌బెరాకు అసాంజే ప్ర‌త్యేక విమానంలో బ‌య‌లుదేరారు. 14 ఏళ్ల న్యాయ‌పోరాటం త‌ర్వాత అసాంజే త‌న స్వంత ఇంటికి స్వేచ్ఛ‌గా వెళ్తున్నార‌ని ఆయ‌న త‌ర‌పున వాదించిన లాయ‌ర్ జెన్ రాబిన్‌స‌న్ తెలిపారు. అసాంజే విముక్తి కావ‌డం భావ స్వేచ్ఛ కేసులో విజ‌యం సాధించిన‌ట్లే అని ఆయ‌న త‌ర‌పున లీగ‌ల్ టీమ్ పేర్కొన్న‌ది. 

మీడియా స్వేచ్ఛ‌, జాతీయ భ‌ద్ర‌త లాంటి అంశాల‌పై అసాంజే కేసు కీల‌కంగా మారిన‌ట్లు రాబిన్‌స‌న్ వెల్ల‌డించారు.అసాంజే విడుదలకు స‌హ‌క‌రించిన ఆస్ట్రేలియా ప్ర‌ధాని ఆంథోనీ అల్బ‌నీస్ ఆమె ధన్యవాదాలు తెలిపారు.

అసాంజే విడుదలపై అమెరికా న్యాయ‌శాఖ ఓ ప్ర‌క‌ట‌న జారీ చేసింది. అమెరికాతో కుదిరిన ఒప్పందంపై చాలా వివ‌ర‌ణాత్మ‌కంగా ఆ నోట్‌లో రాశారు. అయితే ఎటువంటి అనుమ‌తి లేకుండా అసాంజే అమెరికాలో ప్ర‌వేశించ‌రాదు అని నిషేధం విధించారు. అయితే ఆ ఆంక్ష‌ల‌పై క్ష‌మాభిక్ష కోర‌నున్న‌ట్లు స్టెల్లా అసాంజే తెలిపారు. అమెరికా నేల‌పై ఎటువంటి ఆంక్ష‌లు లేకుండా కాలు మోపేందుకు అనుమ‌తి తీసుకోనున్న‌ట్లు ఆమె చెప్పారు.

అమెరికా ప్రభుత్వం మోపిన గూఢచర్యం అభియోగాలు ఎదుర్కొంటున్న అసాంజే 2019 నుంచి లండన్‌లోని ఓ జైలులో ఉన్నారు. ఇంతకాలం లండన్‌లో శరణార్థులుగా ఉన్న అసాంజే సతీమణి, ఆయన పిల్లలు మంగళవారం ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లారు.