ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్ రాజ్యాంగం గురించి మాట్లాడటమా!

ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్ రాజ్యాంగం గురించి మాట్లాడటమా!
ఈ దేశంలో నిరంకుశత్వంతో ఎమర్జెన్సీని విధించి నియంతృత్వ పోకడలు అవలంబించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడటం చూస్తుంటే ఆశ్చర్యమేస్తుందని మహారాష్ట్ర మాజీ గవర్నర్, ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమకారుడు సిహెచ్ విద్యాసాగర్ రావు  తెలిపారు.
 
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉస్మానియా యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తవుతున్న వేళ ఎమర్జెన్సీ చీకటి రోజులను స్మరించుకుంటూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో `నియంతృత్వం నిరంకుశత్వం -ఎమర్జెన్సీ చీకటి రోజులు’ అనే అంశంపై జరిపిన సెమినార్ లో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.

దేశంలో ఎమర్జెన్సీ విధించి అనేక రాజ్యాంగ సవరణలకు ఆజ్యం పోసారని పేర్కొంటూ  కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ హయాంలో చేసిన రాజ్యాంగ సవరణలను మరిచిపోయి రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడడం విడ్డూరమని ఆయన విమర్శించారు.  1975 జూన్ 25 వ తేదీన ఈ దేశంలో ఇందిరాగాంధీ నియంతృత్వ పోకడలతో ఎమర్జెన్సీని విధించిందని ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించిన వాళ్లపై మీసా చట్టం కింద కేసులు నమోదు చేసి ఏళ్ల తరబడి జైళ్ళలో ఉంచారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
 
భారతదేశ డిఎన్ఏ లో ఉండేది లౌకికత్వం కాదు సౌబ్రాతృత్వమని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగం గురించి పార్లమెంటులో చర్చ జరిగే సమయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సౌబ్రాతృత్వం ఈ దేశ వారసత్వ సంపద అని, ఈ దేశంలో ప్రజలు అవలంబించే పద్ధతులు నుండి వచ్చిందని  చెప్పారని తెలిపారు.మనమందరం సౌబ్రాతృత్వాన్ని అలవర్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన విద్యార్థి లోకాన్ని కోరారు.
 
ఇండోనేషియా లాంటి అనేక దేశాలు భారతదేశాన్ని ఒక పురాతన సాంస్కృతిక దేశంగా, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను అవలంబిస్తుంటే మన దేశంలోని కొంతమంది స్వార్ధ రాజకీయ నాయకుల కారణంగా దేశ విలువలను దిగజార్చే విధంగా తయారయ్యారని ఆయన విచారం వ్యక్తం చేశారు. తాను గవర్నర్ గా ఉన్నప్పుడు సెప్టెంబర్ 17ను తెలంగాణ విముక్తి దినంగా అధికారికంగా నిర్వహించడం కోసం ఏర్పాట్లు చేశామని తెలిపారు. 
 
తద్వారా భారత ప్రభుత్వం గెజిటెడ్ విడుదల చేసిందని చెప్పారు. భారతదేశం పైన జరిగిన ఆక్రమణలు ప్రస్తుతం దేశం పైన జరుగుతున్న అనేక కుట్రల పైన ప్రస్తుత విద్యార్థులు అవగాహన కలిగి దేశం కోసం నిలబడేటటువంటి బృహత్తరమైన బాధ్యత మన పైన ఉందని ఆయన చెప్పారు.