జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో జిల్లా రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ వ్యవహారంతో అసంతృప్తికి గురైన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది.
సంజయ్ చేరికపై పార్టీ అధిష్ఠానం కనీసం తనకు సమాచారం ఇవ్వకపోవడంతో జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, సంజయ్ చేరికపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో సోమవారం ఉదయం నుంచే జీవన్‌రెడ్డి ఇంటికి పార్టీ నాయకులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు.
ఆయన రాజీనామా చేయనున్నట్లు తెలియగానే ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఆది శ్రీనివాస్ వెనువెంటనే జీవన్‌రెడ్డి నివాసానికి చేరుకుని ఆయణ్ను బుజ్జిగించే పనిలో పడ్డారు. ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని వారు కోరినట్లు సమాచారం.
40 ఏళ్లుగా పార్టీలో ఉన్న తనకు కనీసం సమాచారం లేకుండా బీఆర్ఎస్ నేతను పార్టీలో చేర్చుకోవడంతో తాను తీవ్ర మనస్థాపానికి గురయ్యానని జీవన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంపై అనుచరులతో సమాలోచనలు చేస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో 65 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నదని, ఇతర పార్టీల నాయకులను చేర్చుకోవాల్సిన అవసరం ఉందని తాను భావించడం లేదని, ఇలాంటి వాటిని తాను వ్యక్తిగతంగా ప్రోత్సహించనని ప్రకటించిన రోజుననే ఈ విధంగా తన రాజకీయ ప్రత్యర్థిని తన సంబంధం లేకుండా పార్టీలో చేర్చుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జీవన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నారన్న విషయం తెలియగానే కాంగ్రెస్ అనుచరులు ఆయన ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అయితే పార్టీ అధిష్ఠానం నుంచి పెద్దలు ఆయనతో మాట్లాడుతున్నారు. దీని తర్వాత ఆయన తన నిర్ణయం వెల్లడించనున్నట్లు తెలిసింది.
జగిత్యాల నియోజకవర్గంలో 2014 నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యే సంజయ్, జీవన్‌రెడ్డి ప్రత్యర్థులుగా కొనసాగుతున్నారు. 2023 శాసనసభ ఎన్నికల్లోనూ వీరిద్దరే పోటీపడ్డారు. ఈ నేపథ్యంలో తనకు తెలియకుండా సంజయ్‌ను కాంగ్రెస్ గూటికి చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
40 ఏళ్లు గౌరవప్రదంగా రాజకీయాలు చేశానని, పార్టీకి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానని సన్నిహితుల వద్ద జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించినట్లు తెలిసింది. మరోవంక, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి సమక్ష్యంలో కాంగ్రెస్ పార్టీ చేరిన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు.
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిచంగా జగిత్యాల తహసీల్ చౌరస్తా వద్ద మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఎమ్మెల్యే ఇంటిని గులాబీ కార్యకర్తలు ముట్టడించారు. దీంతో సంజయ్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాగా, జీవన్ రెడ్డిని కరీంనగర్, మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ఈటల రాజేందర్ కలుస్తారని వార్తలు షికారు చేస్తున్నాయి. జీవన్ రెడ్డిని భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉందని జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ వార్తలపై జీవన్ రెడ్డి ఇప్పటి వరకు స్పందించలేదు.

More Stories
పంజాబ్ లో ఆర్ఎస్ఎస్ నేత కుమారుడి కాల్చివేత
ఏకాత్మ మానవతావాదంతో సనాతన తత్వశాస్త్రం అందించారు
మహిళ + ఇ బి సి = బీహార్ సునామీ