
ఎర్రుపాలెం- అమరావతి- నంబూరు మధ్య భూసేకరణకు వీలుగా, దీనిని ప్రత్యేక ప్రాజెక్ట్‌గా గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. విజయవాడ, గుంటూరు రైల్వే లైన్లకు రాజధాని ప్రాంతాన్ని అనుసంధానం చేసేలా 2017-18లోనే కొత్త రైల్వే లైన్ మంజూరైంది.
ఎర్రుపాలెం- అమరావతి- నంబూరు మధ్య 56 కిలోమీటర్ల మేర డబుల్ లైన్, అమరావతి- పెదకూరపాడు మధ్య 24న్నర కిలోమీటర్ల సింగిల్ లైన్, సత్తెనపల్లి-నరసరావుపేట మధ్య 25 కిలో మీటర్ల సింగిల్ లైన్ కలిపి మొత్తం 106 కిలోమీటర్ల మేర కొత్తలైన్‌కు అప్పట్లోనే ఆమోదం లభించింది. కానీ, జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతిని పాడుబెట్టడంతో రైల్వే లైన్ ప్రాజెక్టు అటకెక్కింది.
చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడంతో రైల్వేశాఖలో కదలిక వచ్చింది. ఈ ప్రాజెక్టులో ఎర్రుపాలెం- అమరావతి- నంబూరు మధ్య 56.53 కి.మీ. మేర డబుల్ లైన్ బదులుగా మొదట సింగిల్ లైన్ నిర్మాణానికి సిద్ధమైంది. ఈ లైన్‌కు కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఖమ్మం జిల్లాల పరిధిలో 450 హెక్టార్ల మేర భూసేకరణ చేయనుంది. సింగిల్ లైన్ నిర్మాణానికి, భూసేకరణకు కలిపి రూ. 2,600 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది.
ఈ కొత్తలైన్ విజయవాడ- హైదరాబాద్ మార్గంలో ఎర్రుపాలెం వద్ద మొదలై, అమరావతి మీదుగా గుంటూరు- విజయవాడ లైన్‌లోని నంబూరు వద్ద కలుస్తుంది. ఎర్రుపాలెం తర్వాత పెద్దాపురం, చిన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావూరుల్లో 9 కొత్త స్టేషన్లు నిర్మించనున్నారు.
వీటిలో పెద్దాపురం, పరిటాల, కొప్పురావూరు పెద్దస్టేషన్లుగా, అమరావతిని ప్రధాన స్టేషన్‌గా నిర్మిస్తారు. ఈ లైన్లో భాగంగా కృష్ణా నదిపై కొత్తపేట-వడ్డమాను మధ్య 3 కిలోమీటర్ల పొడవైన వంతెన నిర్మిస్తారు.
More Stories
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్
నాయీ బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారం బిజెపి థ్యేయం
అన్నమయ్య జిల్లాకు పీఎం ధన ధాన్య కృషి యోజనలో చోటు