అన్నమయ్య జిల్లాకు పీఎం ధన ధాన్య కృషి యోజనలో చోటు

అన్నమయ్య జిల్లాకు పీఎం ధన ధాన్య కృషి యోజనలో చోటు
అన్నమయ్య జిల్లాకు  ‘ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన’ పథకంలో చోటు లభించింది. దేశంలో వెనుకబడిన 100 జిల్లాల్లో ఈ పథకం అమలు చేయనుండగా అందులో అన్నమయ్య జిల్లా ఒకటి. కేంద్రం అమలు చేసే 11 మంత్రిత్వ శాఖల్లోని 36 పథకాలను సమ్మిళితం చేసి ఈ కార్యక్రమాన్ని తయారు చేసింది. వాటికింద ఏటా ఖర్చుచేసే రూ.24,000 కోట్లనే ఈ పథకానికి కేటాయిస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి ఆరేళ్లపాటు ఇది అమల్లో ఉంటుంది.
రాష్ట్రం నుంచి కనీసం ఒక జిల్లాను ఈ పథకానికి ఎంపిక చేస్తారు. ఉత్పాదకత, సాగు విస్తీర్ణం, రుణ వినియోగం ఈ మూడూ తక్కువగా ఉన్న జిల్లాలను ఎంపికచేసి మిగతా జిల్లాలతో సమానంగా పైకి తీసుకు రావడానికి చేయూతను అందిస్తారు.  దీనికింద 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం లభిస్తుందని కేంద్రం వెల్లడించింది. ఈ కార్యక్రమం కింద దేశంలో వ్యయం చేయనున్న రూ.24,000 కోట్ల నిధుల్లో అన్నమయ్య జిల్లాకూ వాటా దక్కనుంది.

డిజిటల్‌ డ్యాష్‌బోర్డు ద్వారా ఈ పథకం పురోగతిని 117 ముఖ్యమైన సూచికల ఆధారంగా కొలుస్తారు. ఈ డ్యాష్‌బోర్డును నెలవారీగా సమీక్షిస్తారు. నీతి ఆయోగ్‌ కూడా ఎప్పటికప్పుడు సమీక్షించి మార్గనిర్దేశం చేస్తుంది. అలానే ఈ ఫథకం అమలు కోసం జిల్లాకు కేంద్ర నోడల్‌ అధికారిగా కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి అమిత్‌సింగ్లా నియమితులయ్యారు.

పథకం అమలుకు కేంద్రం సూచించిన మేరకు జిల్లా స్థాయిలో ప్రణాళికను తయారు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఓ కీలక సమావేశం నిర్వహించగా జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ రెండో విడతగా మరో సమావేశం నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రధాని మోదీ దీనిని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం నవంబరు మొదటి వారం నుంచి క్షేత్రస్థాయిలో అమలుకు సన్నాహాలు చేస్తున్నారు. 

 
దీనిపై జిల్లా వ్యవసాయాధికారి శివనారాయణ మాట్లాడుతూ రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ప్రగతిశీల రైతులు, అధికారులతో జిల్లా స్థాయి ధన ధాన్య కృషి యోజన సమితి ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అదే విధంగా రాష్ట్ర, జాతీయ స్థాయి కమిటీలు జిల్లా స్థాయి ప్రణాళికల అమలును పర్యవేక్షిస్తాయని తెలిపారు.