విద్యుత్ ఉద్యోగుల జీవితాల్లో చీకట్లు

విద్యుత్ ఉద్యోగుల జీవితాల్లో చీకట్లు
విద్యుత్ శాఖలో ఆర్థికపరమైన అంశాలు నాణేనికి ఒకవైపు అయితే, విద్యుత్ ఉద్యోగుల భవిష్యత్ మరోవైపుగా ఉందని పేర్కొంటూ తెలంగాణ రైతులు, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే విద్యుత్ ఉద్యోగుల జీవితాలు చీకట్లో మగ్గుతున్నాయని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ ఆందోళన వ్యక్తం చేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని 22వేల మంది విద్యుత్ శాఖలోని కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నామని చెప్పి ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చి ఆర్టిజన్లుగా గుర్తించి, వారి జీవితాలను త్రిశంకు స్వర్గంలో పెట్టిందని ఆమె ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో సకల జనులు చేయిచేయి కలిపి కదంతొక్కి పోరాటంలో భాగస్వామ్యమయ్యారని ఆమె గుర్తు చేశారు.
 

విద్యుత్ శాఖలో కొంతమంది ఉద్యోగులు ట్రాన్స్ ఫార్మర్లు ఎక్కి ఆత్మహత్యలు చేసుకున్నారని ఆమె చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వస్తే నిరుద్యోగి అనే మాట వినపడదు అని గత ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని,  స్వరాష్ట్రం ఏర్పడితే ఒక్కపూటలో సర్వీస్ రూల్స్ మార్చి ఉద్యోగుల భవిష్యత్తును బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతామని కేసీఆర్ మాటలు చెప్పిన్రని ఆమె తెలిపారు.

అయితే, తెలంగాణ రాష్ట్రమొచ్చినంక నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని ఆమె విమర్సించారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని ఆమె ధ్వజమెత్తారు.  గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ రంగంలోని 22 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం దేశంలోనే ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో సబ్ స్టాండర్డ్ రూల్స్ తీసుకొచ్చి ఆర్టిజన్లుగా గుర్తించిందని  రాణి రుద్రమ విమర్శించారు.

కాని నేడు ఆర్టిజన్ల పరిస్థితి దారుణంగా తయారైందని, అనేక సమస్యలతో నెత్తినోరు కొట్టుకుంటున్నరని ఆమె తెలిపారు.  22 వేల మంది విద్యుత్ కార్మికులు.. ప్రైవేటు ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులకు భిన్నంగా ఏ బెనిఫిట్స్ వర్తించకుండా త్రిశంకుస్వర్గంలోకి నెట్టివేయబడ్డారని ఆమె విచారం వ్యక్తం చేశారు.

22 వేల మంది విద్యుత్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చినట్లుగా పే-స్కేల్, ప్రమోషన్లు, రిటైర్ మెంట్ బెనిఫిట్స్, పెన్షన్లు ఏవీ వర్తించడం లేదని ఆమె పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ కార్మికుల సమస్యలను గుర్తించి న్యాయం చేయాలని బిజెపి నేత డిమాండ్ చేశారు.  22 వేల మంది విద్యుత్ కార్మికుల ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, విద్యుత్ శాఖ మంత్రిని రాణి రుద్రమ డిమాండ్ చేశారు.