
తెలంగాణలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచి, ఆగస్టు 1 నుంచి అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చార్జీలు పెంచే ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నది. అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు సమావేశం నిర్వహించి, భూముల మార్కెట్ విలువల సవరణపై చర్చించనున్నారు.
మారెట్ విలువల సవరణను ఈ నెల 23 నాటికి పూర్తి చేస్తారు. ఆ తర్వాత అభ్యంతరాలు ఏమైనా ఉంటే 25వ తేదీ వరకు సమీక్షిస్తారు. ఆ తర్వాత కమిటీ ఆమోదం కోసం పంపుతారు. ఈ నెల 29న కమిటీ ఆమోదం తెలిపిన తర్వాత.. సవరించిన విలువలను జూలై 1న వెబ్‌సైట్‌లో ప్రచురిస్తారు. జూలై 20 వరకు ప్రజల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. వాటి ఆధారంగా ధరల్లో ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే చేసి.. జూలై 31న వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.
ఆ మరుసటి రోజు నుంచి.. అంటే ఆగస్టు 1 నుంచి సవరించిన ధరలు అమల్లోకి రానున్నాయి. స్టాంపు డ్యూటీ పెంచుతారా? లేదా? అనేదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. ప్రస్తుతం మార్కెట్ విలువలో స్టాంపు డ్యూటీ 5.5 శాతంగా ఉన్నది. దీనికి ట్రాన్స్‌ఫర్ డ్యూటీ 0.5%, రిజిస్ట్రేషన్ చార్జీలు 1.5% కలిపి రిజిస్ట్రేషన్ ఫీజు మార్కెట్ విలువలో 7.5 శాతంగా ఉన్నది.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో రియల్‌ఎస్టేట్ రంగంపై ప్రభావం పడే అవకాశం ఉన్నదని వ్యాపారులు, మార్కెట్ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో భూముల విలువ బాగా పెరిగినప్పుడో, క్రయవిక్రయాలు జోరుమీద ఉన్నప్పుడో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే పెద్దగా ప్రభావం కనిపించదని చెప్తున్నారు.
కానీ, రాష్ట్రంలో గత ఏడాది సెప్టెంబర్ నుంచి వరుసగా ఎన్నికలు, కొత్త ప్రభుత్వాలు, ఎన్నికల కోడ్ వంటి పరిణామాలు, ఇతర కారణాలతో రియల్‌ఎస్టేట్ రంగం స్తబ్దుగా ఉన్నదని అంటున్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది మొదటి రెండు నెలల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య సగటున 23% తగ్గుదల నమోదైందని ఉదహరిస్తున్నారు. గత మూడు నెలల్లో గమనించినా 20% తగ్గుదల ఉన్నదని వివరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెంపు సరైన నిర్ణయం స్పష్టం చేస్తున్నారు.
మార్కెట్ ధరలను కనిష్ఠంగా 20%, గరిష్ఠంగా 40% వరకు సవరించే అవకాశం ఉన్నది తెలుస్తున్నది. ఈ నెల 18వ తేదీ నుంచి ఆర్థిక మంత్రి వివిధ విభాగాల అధిపతులతో బడ్జెట్ సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పెంచబోయే ధరలకు అనుగుణంగానే అంచనాలు రూపొందించాలని ఆదేశాలు జారీ అయినట్టు తెలిసింది.
More Stories
స్వదేశీ, స్వావలంబన దిశగా స్వదేశీ జాగరణ్ మంచ్
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!