‘స్పేస్‌ బగ్‌’ రూపంలో అంతరిక్ష యాత్రికులకు ఇబ్బందులు!

‘స్పేస్‌ బగ్‌’ రూపంలో అంతరిక్ష యాత్రికులకు ఇబ్బందులు!

అంత‌రిక్ష కేంద్రంలో ఉన్న భార‌తీయ సంత‌తి వ్యోమ‌గామి సునీతా విలియ‌మ్స్‌తో పాటు మ‌రో 8 మంది ఆస్ట్రోనాట్స్ ప‌రిస్థితి ప్ర‌మాద‌క‌రంగా మారే అవ‌కాశాలు ఉన్నాయి. స్పేస్ స్టేష‌న్‌లో స్పేస్‌బ‌గ్ ప్రవేశించడంతో ఆందోళన చెందుతున్నారు. ఎంటిరోబ్యాక్ట‌ర్ బుగండెన్సిస్ బ్యాక్టీరియా అంత‌రిక్ష కేంద్రంలో ఉన్న‌ట్లు గుర్తించారు. ఆ జీవి మ‌ల్టీ డ్ర‌గ్ రెసిస్టెంట్ అని తేల్చారు. 

స్పేస్ స్టేష‌న్ వాతావ‌ర‌ణాన్ని ఆ బ్యాక్టీరియా త‌ట్టుకుంటోంద‌ని, మ‌ల్టీ డ్ర‌గ్ రెసిస్టెంట్ కావ‌డం వ‌ల్లే దాన్ని సూప‌ర్‌బ‌గ్ అని పిలువాల్సి వ‌స్తోంద‌ని నాసా వెల్లడించింది. ఈ బ్యాక్టీరియా వ్యోమ‌గాముల ఊపిరితిత్తుల‌కు సోకే అవ‌కాశం ఉన్న‌ది.  అంతరిక్ష వాతావరణంలో ఈ బ్యాక్టీరియా మరింత బలం పెంచుకుంటోందని తెలిపారు. ఇది అనేక ఔషదాలను నిరోధించగలిగే శక్తివంతమైనదని వివరించారు

సూప‌ర్‌బ‌గ్స్ అనేవి గ్ర‌హాంత‌ర జీవులు కావు అని, కానీ అవి వ్యోమ‌గాముల‌తోనే స్పేస్ స్టేష‌న్‌కు ప్ర‌యాణించి ఉంటాయ‌ని నాసా శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు. 

ఎంటిరోబ్యాక్ట‌ర్ బుగండెన్సిస్‌కు చెందిన 13 ర‌కాల స్ట్రెయిన్స్ స్ట‌డీ చేస్తున్న‌ట్లు నాసా తెలిపింది. అంత‌రిక్ష కేంద్రంలో ఆ బ్యాక్టీరియా ర‌కాలు త‌ట్టుకునే శ‌క్తిని డెవ‌ల‌ప్ చేసుకుంటున్న‌ట్లు గుర్తించారు. ఇత‌ర జీవుల‌తో పాటు ఈ.బుగండెన్సిస్ బ్యాక్టీరియా జీవిస్తోంద‌ని, కొన్ని సంద‌ర్భాల్లో ఇత‌ర జీవులు బ్ర‌తికేందుకు కూడా ఆ బ్యాక్టీరియా ఉప‌యోగ‌ప‌డుతున్న‌ట్లు తెలిపారు.

కాలిఫోర్నియాలోని నాసా జెట్ ప్రొప‌ల్స‌న్ ల్యాబ్‌లో ప‌నిచేస్తున్న డాక్ట‌ర్ క‌స్తూరి వెంక‌టేశ్వ‌ర‌న్  స్పేస్ స్టేష‌న్ బ్యాక్టీరియాపై అధ్య‌య‌నం చేస్తున్నారు. నాసాలో చెరడానికి ముందు ఆయ‌న చెన్నైలోని అన్నామ‌ళై వ‌ర్సిటీలో మెరైన్ మైక్రోబ‌యాల‌జీ చేశారు. ఆ స‌మ‌యంలో మ‌ల్టీ డ్ర‌గ్ రెసిస్టెంట్ క‌లేమిలా పియ‌ర్సోనీ బ‌గ్‌ను ఆయ‌న గుర్తించారు. జేపీఎల్‌తో పాటు ఐఐటీ మ‌ద్రాసు  సంయుక్తంగా బుగండెన్సిస్ బ్యాక్టీరియాపై స్ట‌డీ చేస్తోంది.

భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్‌ సునీతా విలియమ్స్‌ (59) మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లారు. బోయింగ్‌ స్టార్‌లైనర్‌ అంతరిక్ష నౌక ద్వారా మరో వ్యోమగామి బుచ్‌ విల్మోర్‌తో సురక్షితంగా అంతరిక్ష కేంద్రం (ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌)కు చేరుకున్నారు.