
మహమ్మద్ సిరాజ్ వికెట్ తీయకున్నా 4 ఓవర్లలో 19 పరుగులే ఇచ్చి రాణించాడు. భారత బౌలర్ల విజృంభణతో పాకిస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులే చేసి పరాజయం పాలైంది.
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (13)ను ఐదో ఓవర్లో ఔట్ చేసి భారత్‍కు బ్రేక్ ఇచ్చాడు బుమ్రా. అయితే, మరో ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ (31) నిలకడగా ఆడాడు. ఉస్మాన్ ఖాన్ (13)ను అక్షర్ పటేల్ పదో ఓవర్లో ఔట్ చేయగా.. ధాటిగా ఆడిన ఫకర్ జమాన్ (13)ను పాండ్యా పెవిలియన్‍కు పంపాడు. నిలకడగా ఆడిన ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్‍ను 15వ ఓవర్లో బుమ్రా బౌల్డ్ చేశాడు.
దీంతో మ్యాచ్ మలుపు తిరిగింది. చివరి ఐదు ఓవర్లలో గెలిచేందుకు పాకిస్థాన్ 37 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆ తరుణంలో భారత బౌలర్లు మళ్లీ విజృభించారు. 16వ ఓవర్లో అక్షర్ పటేల్ రెండు పరుగులే ఇచ్చాడు. దీంతో పాక్ ఒత్తిడిలో కూరుకుపోయింది. 17వ ఓవర్లో షాదాబ్ ఖాన్ (4)ను హార్దిక్ ఔట్ చేశాడు. జస్‍ప్రీత్ బుమ్రా 19వ ఓవర్లో కేవలం 3 పరుగులే ఇచ్చాడు. ఇఫ్తికార్ (5)ను ఔట్ చేశాడు. దీంతో పాక్ ఓటమి అంచులకు చేరింది.
చివరి ఓవర్లో పాక్‍కు 18 పరుగులు అవసరమయ్యాయి. అర్షదీప్ వేసిన ఆఖరి ఓవర్లో 11 పరుగులు రాగా.. 6 రన్స్ తేడాతో భారత్ గెలిచింది. చివరి ఓవర్ తొలి బంతికి ఇమాద్ వసీం (15)ను అర్షదీప్ ఔట్ చేయగా.. నాలుగు, ఐదు బంతులకు ఫోర్లతో నసీమ్ షా (10 నాటౌట్) కాస్త టెన్షన్ పెట్టాడు. అయితే, చివరి బంతిని అర్షదీప్ కట్టడి చేశాడు. దీంతో టీమిండియా విజయం సాధించింది.
అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగుకు ఆలౌటైంది. రిషబ్ పంత్ 31 బంతుల్లో 42 పరుగులు (ఆరు ఫోర్లు) రాణించాడు. తొలుత ఇబ్బందులు పడినా.. వచ్చిన లైఫ్‍లను ఉపయోగించుకొని దీటుగా ఆడాడు. అక్షర్ పటేల్ కూడా 18 బంతుల్లో 20 పరుగులతో పర్వాలేదనిపించాడు. పంత్, అక్షర్ కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పారు.
అయితే, మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. విరాట్ కోహ్లీ (4), రోహిత్ శర్మ (13), సూర్యకుమార్ యాదవ్ (7), శివమ్ దూబే (3) త్వరగా ఔటయ్యారు. హార్దిక్ పాండ్యా (7) ఎక్కువ సేపు నిలువకపోగా.. రవీంద్ర జడేజా (0) డకౌట్ అయ్యాడు. చివర్లో అర్షదీప్ సింగ్ (9), మహమ్మద్ సిరాజ్ (7 నాటౌట్) విలువైన పరుగులు చేశారు.
పాకిస్థాన్ పేసర్లు నసీమ్ షా, హరీస్ రవూఫ్ చెరో మూడు వికెట్లు తీసుకోగా.. మహమ్మద్ ఆమిర్ రెండు తీశాడు. షహీన్ అఫ్రిది ఓ వికెట్ పడగొట్టాడు. ఆరంభంలో వాన వల్ల మ్యాచ్ ఆలస్యంగా ఆరంభమైంది. అయితే, పూర్తి ఆట సాధ్యమైంది. అయితే, స్వల్ప స్కోరును భారత్ అద్భుతంగా కాపాడుకుంది. టీమిండియా బౌలర్లు సత్తాచాటి.. పాక్‍ను పడగొట్టారు. ఐసీసీ టోర్నీల్లో పాకిస్థాన్‍పై భారత్ ఆధిపత్యం కొనసాగింది. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో ఇప్పటి వరకు ఇరు జట్లు 8సార్లు తలపడగా.. భారత్ 7సార్లు విజయం సాధించింది.
రిషబ్ పంత్ ఈ మ్యాచ్‍లో బ్యాటింగ్‍లో 42 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే, వికెట్ కీపింగ్‍లోనూ అదరగొట్టాడు. మూడు మంచి క్యాచ్‍లు పట్టాడు. ఫకర్ జమాన్ క్యాచ్‍ను వెనక్కి డైవ్ కొట్టి అందుకున్నాడు పంత్. షాబాద్ క్యాచ్‍ను కూడా గాల్లోకి ఎగిరి పట్టాడు. ఇక, చివరి ఓవర్లో ఇమాద్ వాసిం క్యాచ్‍ను డైవ్ కొట్టి అందుకున్నాడు పంత్. కీపింగ్‍లోనూ సత్తాచాటాడు.
ప్రస్తుత టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో భారత్ వరుసగా రెండో విజయం సాధించింది. తొలి మ్యాచ్ ఐర్లాండ్ పై గెలువగా.. నేడు పాకిస్థాన్‍ను చిత్తు చేసింది. దీంతో గ్రూప్-ఏలో టాప్‍కు చేరింది. తదుపరి జూన్ 12న అమెరికాతో భారత్ తలపడనుంది.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు