ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ దేశంలో మూడోసారి అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. మోదీ ప్రభంజనంతో సూచీలు సరికొత్త చరిత్ర సృష్టించాయి. రికార్డు స్థాయిలో పరుగులు పెడుతున్నాయి.
సోమవారం ఉదయం సెన్సెక్స్ ఏకంగా 2,000 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ మొదలుపెట్టగా నిఫ్టీ ఆరంభంలోనే 600 పాయింట్లకు పైగా పుంజుకుంది.
ప్రస్తుతం సెన్సెక్స్ 2,082 పాయింట్లు పెరిగి రూ. 76,043 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక నిఫ్టీ 650 పాయింట్లు లాభపడి 23,175 వద్ద కొనసాగుతోంది. అంతకుముందు సెన్సెక్స్ 76,738.89 దగ్గర, నిఫ్టీ 23,338.70 వద్ద రికార్డు గరిష్టాన్ని నమోదు చేశాయి. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83 వద్ద ప్రారంభమైంది. ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకింగ్ షేర్లు భారీ లాభాల్లో ఉన్నాయి.
పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఎం అండ్ ఎం, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రియలన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఈ స్టాక్స్ 3 నుండి 7 శాతం లాభాలబాటలో ఉన్నాయి.
సోమవారం అదానీ గ్రూప్ షేర్లు భారీ లాభాలు ఆర్జించాయి. ముఖ్యంగా అదానీ పవర్ స్టాక్స్ 16 శాతం వరకు లాభపడింది. బ్లూ-చిప్ స్టాక్స్ అయిన రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ కూడా భారీ లాభపడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని చెప్పడంతో, రోజంతా బుల్ రన్ ఎక్కడా తగ్గకుండా కొనసాగింది.
ఈ బుల్ రన్లో పీఎస్‌యూ, పవర్, యుటిలిటీస్, ఆయిల్, ఎనర్జీ, క్యాపిటల్ గూడ్స్, రియాలిటీ రంగాలు అన్నీ రాణించాయి. ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, హాంకాంగ్ మంచి లాభాలతో ముగిశాయి. షాంఘై మాత్రం నష్టపోయింది. ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి. యూఎస్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే.

More Stories
షట్‌డౌన్ తో అమెరికాకు నెల రోజుల్లో 7 బిలియన్ డాలర్ల నష్టం
అక్టోబర్ లో రికార్డు స్థాయిలో రూ. 1.96 లక్షల కోట్ల జీఎస్టీ
రూ 700 కోట్ల అక్రమాస్తులు.. పంజాబ్ మాజీ మంత్రిపై దర్యాప్తు