ఎండలకు వందల సంఖ్యలో మృతి.. జాతీయ విపత్తు

ఎండలకు వందల సంఖ్యలో మృతి.. జాతీయ విపత్తు
* ఉత్తరప్రదేశ్‌లో రెండు రోజుల్లో 166 మంది మృతి
 
 దేశ వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌పైగా నమోదవుతున్నాయి. ఎండలకు తాళలేక వందలాది మంది మరణించారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. 
 
రాజస్థాన్‌తోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ దాటాయి. దీంతో ఎండలను తట్టుకోలేక వడదెబ్బ బారిన పడి వందల సంఖ్యలో ప్రజలు మరణించారు. అయితే జనాన్ని కాపాడేందుకు ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.

కాగా, రాజస్థాన్‌ హైకోర్టు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. ఎండలకు జనం పిట్టల్లా రాలిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. జస్టిస్ అనూప్ కుమార్ దాండ్‌ నేతృత్వంలోని సింగిల్‌ బెంచ్ ధర్మాసనం దీనిపై సుమోటోగా విచారణ చేపట్టింది. వరదలు, తుఫానుల మాదిరిగా వేడి, చలి గాలులను జాతీయ విపత్తుగా ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని కోర్టు పేర్కొంది.

మరోవైపు వడదెబ్బతో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం అందించే చర్యలు చేపట్టాలని రాజస్థాన్‌ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అలాగే ‘హీట్ యాక్షన్ ప్లాన్’ను సమర్థవంతంగా అమలు చేసేందుకు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. వివిధ శాఖలతో కూడిన కమిటీలను ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ‘మనం వెళ్లగలిగే మరో గ్రహం లేదు. మనం ఇప్పుడు కఠిన చర్యలు తీసుకోకపోతే, మన భవిష్యత్ తరాల వృద్ధి అవకాశాలను కోల్పోతాం’ అని కోర్టు వ్యాఖ్యానించింది.

కాగా, భగభగమంటున్న సూర్యుడి వేడి ప్రతాపానికి ఉత్తరప్రదేశ్‌లో 166మంది మృతి చెందారు. పలుచోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు పేలి కరెంటు కోతతో ప్రజలు విలవిల్లాడిపోయారు. బులంద్‌షహర్‌లో గురువారం 48 డిగ్రీల సెల్సియస్‌తో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే సమయంలో రాష్ట్రంలోని పలు చోట్ల కరెంటు కోతలతో గందరగోళం నెలకొంది. 

రానున్న వారం రోజులపాటు ఎండ వేడిమి నుంచి విముక్తి ఉండబోదని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం కరెంటు కోత కారణంగా విద్యుత్‌ శాఖపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్నో, ఝాన్సీ, లఖింపూర్‌ సహా పలు జిల్లాల్లో ప్రజలు బీభత్సం సృష్టించారు. రాయబరేలీలో కరెంటు కోతతో వ్యాపారులు ఆందోళనకు దిగారు. 

అయోధ్య, గోండాలో కూడా అలజడి చెలరేగింది. విద్యుత్‌ కోతకు గల కారణాలను వినియోగదారులకు తెలియజేయాలని పవర్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఆశిష్‌ గోయల్‌ అధికారులను ఆదేశించారు. సెంట్రల్‌ యుపి లో వేడిగాలుల కారణంగా 47 మంది చనిపోయారు. సెక్టార్‌ మేజిస్ట్రేట్‌, హెడ్‌ కానిస్టేబుల్‌, ముగ్గురు రైల్వే కార్మికులు, హౌంగార్డు, ఇంజనీర్‌తో సహా వారణాసి, పరిసర జిల్లాల్లో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. 

 సహరాన్‌పూర్‌లోని శివాలిక్‌ కొండల్లో కూడా వేడి ప్రభావం చూపడం ప్రారంభించింది. బెహత్‌ ప్రాంతంలోని శివాలిక్‌ కొండలపై ఉన్న అడవిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం రోజంతా అగ్నిప్రమాదం కొనసాగింది. స్థానిక పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను ఆర్పే పనిలో నిమగమై ఉన్నారు.