దేశంలో దాదాపు 3 నెలలుగా సాగుతున్న ఎన్నికల ప్రచారానికి గురువారంతో తెరపడింది. జాతీయ, ప్రాంతీయ పార్టీలు అభ్యర్థులు గత కొన్ని నెలలుగా చేస్తున్న ప్రచారం గురువారంతో ముగిసింది. 7 దశల లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ప్రచారం పూర్తి కాగా, ఇక చివరి విడత ఎన్నికలు జూన్ 1 వ తేదీన జరగనున్నాయి. జూన్ 4 వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి.
ఇక గత 3 నెలలుగా ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల సభలు, సమావేశాలు, రోడ్ షోలు, ర్యాలీలు, ఇంటర్వ్యూలతో హోరెత్తించారు. ఇక ఫలితాలు వెల్లడయ్యేందుకు కొంత సమయం ఉండటంతో ప్రస్తుతం తమిళనాడులోని కన్యాకుమారిలో ధ్యానం చేస్తున్నారు.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కుటమిని ముచ్చటగా మూడోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసిన నరేంద్ర మోదీ 73 ఏళ్ల వయసులో దేశం మొత్తాన్ని చుట్టి వచ్చారు. రోజూ 3 నుంచి 5 ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మొత్తం మీద మోదీ ఈ 75 రోజుల్లో 180 ర్యాలీలు.. 220 కార్నర్ మీటింగ్స్.. 111 రోడ్ షోలలో పాల్లొని ప్రచార సునామీనే సృస్టించారు
ఈ ఏడాది మార్చి 16 వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారిలో నిర్వహించిన ప్రచారంతో ఎన్నికల శంఖారావాన్ని పూరించిన నరేంద్ర మోదీ 75 రోజుల వ్యవధిలో దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే 200 కంటే ఎక్కువ ఎన్నికల ప్రచార సభలు, కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు.
దీంతో పాటు నేషనల్, లోకల్ ఛానెళ్లు అనే తేడా లేకుండా 80 ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాల్లో ఎక్కువగా రోడ్ షోలు నిర్వహించారు. చివరికి కన్యాకుమారిలో ధ్యానం చేసేందుకు వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని ముగించారు. ఈ ఏడాది మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అప్పటి నుంచి బీజేపీ ప్రచార వేగాన్ని పెంచింది. 22 రోజుల పాటు నిత్యం నాలుగు చోట్ల ప్రచారాలు చేపట్టారు. మూడు పర్యాయాలు అయితే ఒక్క రోజులోనే ఐదేసి సభలు నిర్వహించారు. మే నెలలోనే ప్రధాని 96 ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ప్రధాని మోదీ చేపట్టిన ప్రచారాల్లో దాదాపు సగం ర్యాలీలు కేవలం నాలుగు రాష్ట్రాల్లోనే ఉండటం విశేషం. 80 మంది ఎంపీలను ఎన్నుకునే ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 31 సభలు నిర్వహించారు. ఆ తర్వాత బిహార్‌పై దృష్టిపెట్టిన ప్రధాని ఆ రాష్ట్రంలో 20 ర్యాలీల్లో పాల్గొన్నారు. ఇక, మహారాష్ట్రలో 19, పశ్చిమబెంగాల్‌లో 18 ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు.
2019తో పోలిస్తే మహరాష్ట్రలో ఈసారి మోదీ రెట్టింపు స్థాయిలో ర్యాలీలు నిర్వహించారు. మొత్తంగా ఈ నాలుగు రాష్ట్రాల్లో కలిపి 88 ర్యాలీల్లో పాల్గొన్నారు.
ఈ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో బలం పెంచుకోవాలని చూస్తున్న కమలదళం ప్రచారంలోనూ ఆ దిశగా వ్యూహాలు అమలు చేసింది. ఇక్కడి ఐదు రాష్ట్రాల్లో ప్రధాని 35 ర్యాలీలు నిర్వహించారు.
అత్యధికంగా కర్ణాటక, తెలంగాణలో 11, తమిళనాడులో 7 సార్లు ప్రచారం సాగించారు సొంత రాష్ట్రం గుజరాత్‌లో ప్రధాని ఐదు ర్యాలీలు చేపట్టారు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజు జనతా దళ్‌తో పొత్తు కుదరకపోవడంతో ఆ రాష్ట్రంపైనా బీజేపీ ఫోకస్ పెట్టింది. అక్కడ మోదీ 10ప్రచార సభలు నిర్వహించారు. పూరీలో చేపట్టిన భారీ రోడ్ షోకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.
అటు మధ్యప్రదేశ్‌లో 10, జార్ఖండ్‌లో 7, రాజస్థాన్‌లో 5, ఛత్తీస్‌గఢ్‌లో నాలుగు, హరియాణాలో మూడు ర్యాలీలు నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లోనూ ప్రధాని ఓసారి పర్యటించారు. చివరి రోజైన గురువారం పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో బహిరంగ సభలో పాల్గొని ప్రచారంకు తెరదించారు..
ఇక ఈసారి ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ఇండియా కూటమిని లక్ష్యంగా చేసుకుని అందులో ఉన్న పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు గుప్పించారు. ప్రధానమంత్రి ఎన్నికల ప్రచారంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటా రిజర్వేషన్లు ప్రధాన ప్రచారం అస్త్రాలుగా మారాయి.
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దళితులు, వెనకబడిన వారికి ఇవ్వాల్సిన రిజర్వేషన్లను తొలగించి, వాటిని ముస్లింలకు కట్టబెడుతుందని నరేంద్ర మోదీ విస్తృతంగా ప్రచారం చేశారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో ప్రకటించిన సంపద పునర్విభజన అంశంపై ప్రధాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మన తల్లులు, సోదరీమణుల మంగళసూత్రాలను కూడా లాగేసుకుంటుందని, మన సంపద చొరబాటుదారులకు ఇస్తుందని చెప్పారు. ఇక కాంగ్రెస్ నేతలు మణిశంకర్ అయ్యర్, శామ్ పిట్రోడా సహా ఫరూఖ్ అబ్దుల్లా వంటి నాయకులు చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా ఎన్నికల ప్రచారంలో ఆజ్యం పోయడంతో బిజెపికి ప్రచార అస్త్రాలుగా మారాయి.

More Stories
వందల మొబైల్ ఫోన్లు పేలడంతో బస్సు ప్రమాదం?
అమెరికా గుప్పిట్లో పాక్ అణ్వాయుధాలు
కశ్మీర్ రాజ్యసభ ఎన్నికల్లో ఎన్సీని అడ్డుకున్న బీజేపీ